YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉత్తిపోతలు (కరీంనగర్)

ఉత్తిపోతలు (కరీంనగర్)

ఉత్తిపోతలు (కరీంనగర్)
కరీంనగర్, : బీడు భూములను సాగులోకి తీసుకువచ్చి సస్యశ్యామలం చేయడమే కాకుండా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది. అధికారులు, గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టడంతో లక్ష్యం చేరుకోలేక నిధులు వృథా అయ్యాయి. పథకాలను ఏర్పాటు చేసిన నాటి నుంచి ఏనాడు ఒక పంటకు పూర్తి స్థాయిలో నీరు రాకపోవడంతో  నిరుపయోగంగా ఉండటమే కాకుండా మరమ్మతుల పేర నిధులు దుర్వినియోగమయ్యాయి.  బీర్‌పూర్‌ మండలంలోని రంగసాగర్‌, చిత్రవేణగూడెం, రేకులపల్లెతోపాటు జిల్లాలోని మల్లాపూర్‌, రాయికల్‌ ప్రాంతాల్లో  1988లో చిన్ననీటిపారుదల సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) ద్వారా ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. మండలంలోని రంగసాగర్‌ ఎత్తిపోతల పథకానికి రూ.15లక్షల చొప్పున రెండు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది. ఈ పథకాల ద్వారా దాదాపు 400ల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయని అధికారులు భావించి నిర్మాణాలు పూర్తి చేశారు. పథకాన్ని ప్రారంభించిన ఒక పంటకు మాత్రమే నీరందించగా మరో పంటకు విద్యుత్తు మోటార్లు కాలిపోవడం.. నాణ్యతలేని పైపులు వేయడంతో పగిలిపోవడంతో పథకం నిలిచిపోవడమే కాకుండా రైతులు సాగు చేసుకున్న పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. కొన్నేళ్ల పాటు పథకం వృథాగా ఉండగా మళ్లీ అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో మంజూరుకు నిధులు కృషి చేశారు. కాంట్రాక్టర్‌, అధికారులు అవినీతితో పనులు పూర్తి చేసిన వారం రోజులు కూడా పథకం పనిచేయలేదు. 2014-15లో ఒక ఎత్తిపోతల పథకానికి రూ. 25లక్షలు, మరో ఎత్తిపోతల పథకానికి రూ. 19.79లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం రూ. 11లక్షలకు కుదించి గుత్తేదారుకు పనులకు అప్పగించారు. గుత్తేదారు విద్యుత్తు మోటార్లు, విద్యుత్తు నియంత్రికను  ఏర్పాటు చేసి, పగిలిన పైపులకు మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పథకాన్ని ప్రారంభించకముందే మళ్లీ పైపులు పగిలిపోవడంతో అలాగే వదిలి వెళ్లిపోవడంతో నిరుపయోగంగా మారింది. ఒక్క రంగసాగర్‌లోనే రూ.లక్షల్లో వ్యయం చేసినా ఎకరా భూమికి కూడా సాగు నీరందించలేక పోయారు. మండలంలోని చిత్రవేణిగూడెంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. రంగసాగర్‌ ఎత్తిపోతల సమయంలోనే ఇక్కడ కూడా పథకాన్ని ప్రారంభించారు. 20 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు విద్యుత్తు మోటార్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేశారు. గుత్తేదారు నాసిరకం విద్యుత్తు మోటార్లు అమర్చడంతో తరచూ మోటార్లు కాలిపోయాయి. గిరిజనుల కావడం.. తరచూ మరమ్మతులకు డబ్బులు పెట్టలేక..సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. మరమ్మతులు చేయించలేని గిరిజనులు అలాగే వదిలేయడంతో నిరుపయోగంగా మారాయి. మూలన పడ్డ ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపడితే ఇక్కడి భూములు సాగులోకి రానున్నాయి. రంగసాగర్‌ పథకానికి ఏర్పాటు చేసిన పైపులైన్‌ పూర్తిగా నాసిరకంతో ఏర్పాటు చేశారు. ఆ పైపులైను పూర్తిగా తొలగించి నూతనంగా పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టడం, ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు వ్యయం చేయడం కుదరదు. కాబట్టి పక్క గ్రామాల మాదిరిగా రైతులు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని నిర్వహణ బాధ్యత రైతులు చూసుకోవాలి. అప్పుడే ఎత్తిపోతల పథకం విజయవంతంగా పనిచేసి బీడుభూములు సాగులోకి రానున్నాయి. ఆయా ఎత్తిపోతల పథకం ద్వారా నేరుగా మిరప చెరువు, కడాల కుంటలోకి గోదావరి నీటిని మళ్లించినట్లయితే గ్రామంలోని అందరి భూములకు సాగులోకి రావడమే కాకుండా రెండు పంటలకు నీరు అందే వీలుంటుంది.
గోదావరి నది పక్కనే ఉండటంతో ప్రతి రైతు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు రూ. లక్ష నుంచి రూ. 2లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. గోదావరి ఒడ్డున విద్యుత్తు మోటార్లు ఏర్పాటు చేసుకుని కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా పైపులైన్‌ నిర్మాణం చేపట్టుకుని సాగు నీరు తీసుకెళ్తున్నారు. ఒక్క రంగసాగర్‌ గ్రామంలో గోదావరి తీర ప్రాంతంలో 100 మోటార్లుకు పైగా ఉన్నాయి.

Related Posts