ఆర్థిక మూలాలపై దెబ్బ పడిందే
విజయవాడ,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల గురించి ఈ క్షణం నుంచే ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఆయనకు ఉన్న ఒకే ఒక దిగులు నేతలు కాదు. పార్టీ నేతలు ఈరోజు ఉంటారు. రేపు ఎన్నికల సమయానికి ఈగల్లా చుట్టుముడతారు. తమకు సీట్లు కావాలంటే తమకు కావాలంటూ వత్తిడి తెస్తారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది తెలియంది కాదు. అందుకే నియోజకవర్గాల్లో నేతల గురించి ఆయన పెద్దగా ఆందోళన చెందడం లేదు.ఆయన భయమంతా ద్వితీయ శ్రేణి నేతల గురించే. ఎన్నికల ముందు వరకూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. వివిధ కాంట్రాక్టు పనులు అప్పగించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులను తనకు అనుకూలురైన వారికి కట్టబెట్టారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణంలో వార్డు వరకూ ఈపనులు విచ్చలవిడిగా చేశారు. సర్పంచ్ లకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ద్వితీయ శ్రేణి నేతలు ఆర్థికంగా బలంగా ఉంటే పార్టీ పది కాలాల పాటు బాగా ఉంటుందన్నది చంద్రబాబు విశ్వాసం.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. చంద్రబాబు హయాంలోనే వీరికి బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ రావడంతో అది జరగలేదు. అయితే ఈ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. కొందరు నేతలు తమ పార్టీకి చెందిన వారికే సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టి మరీ సబ్ కాంట్రాక్టులు అప్పగించారు. దీంతో తాము నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని తెలుగుతమ్ముళ్లు కూడా భావించారు.కానీ కథ అడ్డం తిరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు పంపినా జగన్ సర్కార్ మాత్రం పాత బిల్లులను పెండింగ్ లో పెట్టేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగానే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు బాధ అంతా ఇదే. ఆర్థిక మూలాలను జగన్ దెబ్బతిీస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. సర్పంచ్ ల సమావేశం పెట్టి మరీ చంద్రబాబు పోరాటం చేయాల్సిందేనంటున్నారు. తమ నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీసి పార్టీని నిర్వీర్యం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని, ఇది సాగనివ్వమని అంటున్నారు. పనిలో పనిగా పసుపు కాంట్రాక్టర్లను టీడీపీ నేతలు ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ఆదేశించారు. మొత్తం మీద చంద్రబాబు భయమంతా తమకు అనుకూలురైన వారు ఆర్థికంగా దెబ్బతింటే భవిష్యత్తులో పార్టీ ఇబ్బందుల్లో పడుతుందన్నదే. అందుకే ఆయన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు వారిని ఆదుకునే బాధ్యతను అప్పగించారు.