విశాఖలో రంగులు మారుతున్న రాజకీయాలు
విశాఖపట్టణం,
పవన్ కళ్యాణ్ రాజకీయం చిత్రంగా ఉంటుంది. ఆయన వేదిక మీద చెప్పేదానికి చేసే దానికి అసలు పోలికే ఉండదు. పైగా ఆయన నిందించిన వారినే తరువాత పక్కన పెట్టుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా టూర్లో పవన్ టీడీపీ మంత్రులపైన గట్టి విమర్శలే చేశారు. తాజాగా జరిగిన లాంగ్ మార్చ్ లో వారినే పక్కన ఉంచుకుని ప్రసంగాలు చేశారు. ఇక టీడీపీ అవినీతి పార్టీ అన్న పవన్ ఆ పార్టీ సాయమే ఇపుడు కోరుకుంటున్నారు. మరో వైపు విశాఖ జిల్లా మంత్రిగా అప్పట్లో ఉన్న గంటా శ్రీనివాసరావును, ఆయన అనుచరులను టార్గెట్ చేసిన పవన్ ఎన్నికల వేళ గంటా శ్రీనివాసరావు చుట్టానికే అనకాపల్లి టికెట్ ఇచ్చేశారు. మరో వైపు విశాఖ భూ దందాల మీద పద్ద నోరు చేసుకుని విమర్శలు చేసే పవన్ కల్యాణ ఆ స్కాం లో ఆరోపణలు వినిపించే గంటా శ్రీనివాసరావు చుట్టం పరుచూరి భాస్కర రావుని తన పక్కన పెట్టుకోవడమూ వివాదమే అయింది. ఇపుడు ఏకంగా అయన్ని పిలిచి మరీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేశారు.ఒంగోలు నుంచి విశాఖకు వ్యాపారం కోసం వచ్చిన పరుచూరి భాస్కరరావు గంటా శ్రీనివాసరావు చుట్టంగా ఒక వెలుగు వెలిగారు. ఆయన ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీని వీడిపోయారు. మొదట వైసీపీ కోసం ప్రయత్నం చేశారు. ఆ తరువాత టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని భావించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ఇక పొత్తు లేదని తేలడంతో చివరి నిముషంలో జనసేనలో చేరి పవన్ పార్టీ టికెట్ సాధించారు. గెలిచేందుకు బాగా ఖర్చు చేసిన జనసేన అభ్యర్ధిగా ఆయన పేరు అప్పట్లో వినిపించిది. ఇక ఆయనకు అంగబలం, అర్ధబలం ఉన్నాయని తెలిసే పవన్ ఆయన్ని పార్టీలో కొనసాగిస్తున్నారని అంటున్నారు. పవన్ లాంగ్ మార్చ్ కి జనాలకు తరలింపుతో పాటు, అవసరమైన నిధులను కూడా ఖర్చు చేశారని ప్రచారంలో ఉంది. దాంతో అయనకు పార్టీ పదవి ఇచ్చారని అంటున్నారు.రానున్న రోజుల్లో పరుచూరి అవసరం పార్టీకి ఉందన్న గ్రహింపుతోనే ఆయన్ని చేరదీశారని చెబుతున్నారు.ఇక పరుచూరి జనసేనలో ఉంటే గంటా శ్రీనివాసరావు లాంటి వారు కూడా ఇండైరెక్ట్ గా సహకరిస్తారన్న ఎత్తుగడ ఏమైనా ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ ఇన్నాళ్ళకు ఫక్తు రాజకీయ పార్టీ నాయకునిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఎలమంచిలిలో పార్టీకి బలంగా ఉన్న మాజీ టీడీపీ నేత, జనసేన అభ్యర్ధి అయిన సుందరపు విజయకుమార్ కి కూడా అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన సుందరపు కూడా లాంగ్ మార్చ్ కి తన వంతుగా సహాయం చేశారు. ఇక ఎలమంచిలిలో ఆయన ఇప్పటికీ కొంత బలం కలిగిన నేతగా గుర్తింపు పొందుతున్నారు. విశాఖలో కాంగ్రెస్ మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ, టీడీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ కోన తాతారావు వంటి వారు జనసేనలో చేరిన సంగతి విధితమే. వారిని పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ బలమైన నేతలకు పదవులు ఇవ్వడం ద్వారా విశాఖలో వేళ్ళూనుకోవడానికి చూస్తున్నట్లుగా తెలుస్తోంది