Highlights
- పొత్తు పై ఢిల్లీలో జోరుగా ప్రచారం
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు దాదాపు కుదిరినట్టుగానే కనిపిస్తుంది. అందుకు రంగం సిద్దమైనట్టుగా ప్రచారం సాగుతుంది. ఆ దిశగా ఇరుపక్షాల నేతలు తీవ్రస్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్టుగా సమాచారం. శనివారం ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ సలహాలిస్తున్న ప్రశాంత్ కిషోర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశం కావడం జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. ఏపీ బీజేపీ నేతలతో సమావేశం జరుగుతున్న సమయంలోనే పీకేకు అమిత్‌షా సమయమివ్వడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వైసీపీతో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుంటే ఎలా కలిసోస్తుందో.. అనే అంశంపై ప్రశాంత్ కిషోర్ వివరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా మిత్రపక్షమైన టీడీపీ కంటే వైసీపీకే బీజేపీ అధిక పాధాన్యమిస్తోంది.ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశం తర్వాత విజయసాయిరెడ్డి పదుల సార్లు ప్రధానితో సమావేశమయ్యారు. మరో పక్క విజయసాయి ఢిల్లీలో ఉంటే ఎక్కవ సార్లు పీఎంవో చుట్టూ తిరుగుతుంటారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. టీడీపీని వదిలించుకుని వైసీపీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చాలాకాలంగా ఆరోపణలొస్తున్నాయి. జగన్ కేసులను అడ్డం పెట్టుకుని బీజేపీ ఎదగాలని ప్రయత్నం చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.