నిధులు దుర్వినియోగంపై తక్షణ విచారణ
ఏలూరు, నవంబర్ 11,
వివిధ శాఖల్లో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం పై వచ్చే పిర్యాదులపై సంబంధిత అధికారులు స్వయంగా విచారణచేసి అందుకు బాధ్యులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం బందనపురం గ్రామానికి చెందిన సుంకర పోసిబాబు పిర్యాదు చేస్తూ తాడిపూడి, పోలవరం కాలువ భూముల్లో పూర్తిగా విలీనం అయిన భూమిలో గ్రామానికి చెందిన ఒక కులపెద్ద తన స్వప్రయోజనాలకోసం వారి స్వంతపొలాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్దు నిర్మాణం చేస్తున్నారని దానికి పంచాయతీ నిధులు వినియోగిస్తున్నారని చెప్పారు. పంచాయతీ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని చెప్పారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది స్పందిస్తూ జిల్లాలో ఏశాఖలోనైనా నిధులు దుర్వినియోగానికి పాల్పడే విధంగా ఏపనులు చేసినా, అవినీతి అక్రమాలకు ఎవరు పాల్పడినా క్షమించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబందనల మేరకు ప్రజా సంక్షేమంకోసం ఆయాశాఖలు పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను నిబంధనల మేరకు ఖర్చుచేయాలన్నారు. ఈ పిర్యాదుపై స్వయంగా సమగ్ర విచారణ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు రోడ్దు నిర్మాణం నిలుపుదలచేసి తీసుకున్న చర్యలపై 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు పలుసమస్యలపై వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించి వాటిని పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఏలూరు శనివారపుపేటకు చెందిన బయ్యారపు మల్లెమడుగల మేరి అర్జీ సమర్పిస్తూ శనివారపుపేట గ్రామపరిధిలో ఆర్ ఎస్ నెం .88/23 లో తనతండ్రిగారికి వున్న య .0.50 సెంట్లను ప్రభుత్వం వారు ఇళ్లస్థలాలకోసం సేకరించారని, దానికి వచ్చే పరిహారం తనకు వాటా సొమ్ము రు .9,33,333/-లను తనకు ఇప్పించాలని కోరారు. పోలవరం మండలం క్రొత్తచేగొండపల్లి గ్రామానికి చెందిన కుంజం సింగరమ్మ వినతిపత్రం సమర్పిస్తూ కొండ్రుకోట పంచాయతీలోని గాజులగొంది గ్రామంలో మా తల్లిదండ్రులకు వున్న య .8.43 సెంట్లభూమిని వారసురాలునైన నాకు చెందకుండా కలుం వీరాయమ్మ అనే ఆమె రెవెన్యూ అధికారులను మోసంచేసి తప్పుదోవపట్టించి తనపేరున పట్టాదారు పాస్ బుక్ పొంది తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తాళ్లపూడి మండలం గజ్జవరం గ్రామానికి చెందిన మద్దుకూరి వరలక్ష్మి, పిర్యాదుచేస్తూ మా తాతగారు శ్రీమద్దుకూరి వీరన్న పేరున సర్వే నెం .181 లోవున్న రు .7.68 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తులు శ్రీ యెల్లిన పెంటయ్య, రాయంకుల గంగరాజు, కొమ్మరాజు రామచంద్ర అనే వారి పేరున రికార్దుల్లో నమోదు చేశారని చెప్పారు. తన పేరున పట్టాదారు పాస్ బుక్ ఇప్పించాలని కోరారు. అన్నదేవరపేటకు చెందిన కొండేగాంధి సర్వే నెం .146/4ఎ లో తనకు గల య .1.50 సెంట్ల భూమి చింతలపూడి లిప్టుఇరిగేషన్ ప్రాజెక్టుకాలువ నిమిత్తం ప్రభుత్వం భూసేకరణజరిపిందని, కాని ఇంతవరకు తనకు సొమ్ములు రాలేదని చెప్పారు. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ .2 నంబూరి తేజ్ భరత్, ఆర్ డిఒ శివ నారాయణ రెడ్ది, జడ్పి సిఇఒ వి .నాగార్జున సాగర్ , సాంఘిక సంక్షేమశాఖ డిడి రంగలక్ష్మీ దేవి, వ్యవసాయశాఖ జేడి శ్రీమతి గౌషియా బేగం, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.