బాల్యం.. బలహీనం.. (విజయనగరం)
విజయనగరం, నవంబర్ 11: బాల్యం బక్కచిక్కుతోంది... వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేక అనేక రుగ్మతలకు గురవుతున్నారు చిన్నారులు.. పౌష్టికాహారంపై అవగాహన లోపం, చిన్న వయసులోనే వివాహాలు చేయడం, గర్భిణులు సక్రమంగా మందులు తీసుకోకపోవడం, పరిసరాల అపరిశుభ్రత, రక్షితనీరు లేకపోవడం, తరచూ జ్వరాలు, ఇతర రుగ్మతలు ఇందుకు ప్రధాన కారణాలుగా పరిణమిస్తున్నాయి. జిల్లాలో ఏటా 30 వేల వరకూ జననాలు జరుగుతున్నాయి... ఇందులో నెలలు నిండకుండా ప్రసవాలు జరుగుతున్నవి ఎనిమిది శాతం ఉంటుండగా తక్కువ బరువుతో జన్మిస్తున్నవారు 10 నుంచి 15 శాతం వరకు ఉన్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న శిశు జననాల్లో బరువు, ఎదుగుదల లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పుడుతున్న చిన్నారుల్లో లోపాలు ఉంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పోషకాహారమే ఉంటుంది. పిల్లలకు ఏం పెడుతున్నాం, ఏం తింటే పోషకాలు అందుతాయన్న అవగాహన చాలామంది తల్లులకు లేదు. కడుపు నిండా అన్నం పెడుతున్నామని భావిస్తారు తప్ప ఎదుగుదలకు దోహదపడే ఆహారం అందించడంలో విఫలమవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారం అంతంత మాత్రమే. పలుచని పాలు, చిన్నపాటి గుడ్డు, కూరలు ఇతరత్రా ఆహారం నాణ్యతా లోపంతోనే ఉంటోంది. ఇచ్చేది తక్కువైనా నాణ్యత పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తల్లులు వేళలు పాటిస్తూ చిన్నారుల ఆహారంపై శ్రద్ధచూపితే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చిన్నపిల్లల వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారో లేదో తొలిదశలోనే గుర్తించాలి. చురుకుదనం మందగించడం, తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడం, తోటి పిల్లల కంటే ఏ విషయాల్లో భిన్నంగా ఉంటున్నారో తల్లిదండ్రులు తరచూ గమనించాలి. తేడాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఎక్కవ సార్లు అందించాలి. ఎదుగుదల క్షీణిస్తున్న చిన్నారుల కోసం జిల్లాలో పౌష్టికాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్వతీపురం, విజయనగరం ప్రాంతాల్లో వీటి సేవలను సద్వినియోగం చేసుకోవచ్ఛు అనారోగ్యానికి వైద్యంతో పాటు ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తారు. సహాయంగా ఉండే తల్లికి ఆహారంతో పాటు రోజుకి రూ.100 అందజేస్తారు. 14 రోజుల వరకు సేవలు పొందవచ్ఛు వయసుకు తగ్గ బరువు, పొడవు లేని పిల్లలు జిల్లాలో వేలాది మంది ఉన్నా పునరా వాస కేంద్రాలకు వచ్చేవారు వందలోనే ఉన్నారు. పిల్లల్లో ఎదుగుదల క్షీణతకు పరిసరాలు, తాగునీరు ఒక కారణంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి పరిసరాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాగుండాలి. ఆహారం తినే ప్రదేశం శుభ్రంగా ఉంచాలి. రక్షితనీరు అందుబాటులో లేకపోతే నీటిని బాగా మరిగించి చల్లార్చి వడపోసి ఇవ్వాలి. తాగునీటి విషయంలో అజాగ్రత్త కారణంగా పిల్లలు అనేక రుగ్మతులకు గురై ఎదుగుదల క్షీణత, రక్తహీనతకు గురయ్యే అవకాశముంది. ముఖ్యంగా చేతుల శుభ్రతపైనా శ్రద్ధచూపాలి.