YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 పనుల పరుగులు (కడప)

 పనుల పరుగులు (కడప)

 పనుల పరుగులు (కడప)
పులివెందు, నవంబర్ 11 : పులివెందుల పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో మురుగునీటి ప్రవాహం కనిపించకుండా భూగర్భడ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, ఆ మేరకు ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆ దిశగా మున్సిపల్ అధికారులు అడుగులు వేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలు ఏ మేరకు చేపట్టాలన్న విషయమై ఇప్పటికే ఏకే అసోసియేట్‌ సంస్థ ప్రతినిధుల సాయంతో సర్వే చేయించి గుర్తించారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో మిగిలిపోయిన వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పురపాలిక పరిధిలోని మొత్తం 33 వార్డుల్లో సుమారు 25 కిలోమీటర్లు పొడవున భూగర్భ మురుగునీటి పారుదల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ఆకృతులు సిద్ధం చేశారు. గతంలో చేపట్టిన నిర్మాణాలు కొన్నిచోట్ల నాణ్యతా లోపాల కారణంగా దెబ్బతిన్నాయి. వాటిని తొలగించి 5 కిలోమీటర్ల మేర పునర్నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.54 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులు పూర్తయితే త్వరలో మున్సిపాలిటీలోని బహిరంగ స్థలాల్లో మురుగునీటి జాడ కన్పించదు. పారిశుద్ధ్య లోపంతో అవస్థలు పడుతున్న ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ప్రస్తుతం కాల్వల్లో పూడికచేరి ఇళ్ల ముంగిటే మురుగు నిల్వలు వేధిస్తున్నాయి. దుర్గంధానికి తోడు దోమల బెడద అధికమై విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కొందరు చిన్నారులు మృత్యువాత కూడా పడ్డారు. తాజాగా చేపట్టనున్న భూగర్భడ్రైనేజీ పనులు పూర్తయితే అలాంటి పరిస్థితులు ఉండవని పురపాలిక అధికారులు చెబుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఆగిపోయిన, చేయలేని పనులను పూర్తిచేసేందుకు ఆయన తనయుడు చర్యలు చేపట్టడంపై పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పరిధిలోని 19,500 గృహాల నుంచి రోజుకు 8 మిలియన్‌ లీటర్ల మురుగునీరు వెలువడుతోంది. ఇదంతా భూగర్భ డ్రైనేజీ కాల్వ ద్వారా పురపాలిక సరిహద్దుల్లో నూతనంగా నిర్మించే సీక్వెన్సు బ్యాచ్‌ రియాక్టర్‌ (ఎస్‌బీఆర్‌) కేంద్రంలోకి చేరేలా ప్రణాళిక రూపొందించారు. ఈ విధంగా నాలుగు ఎస్‌బీఆర్‌ కేంద్రాలను నిర్మించనున్నారు. వీటిలోకి మురుగునీరు చేరుతుంది. అక్కడ మురుగునీటిని ఆలం తదితర రసాయనాలతో శుద్ధిచేసి పునర్వినియోగానికి పనికొచ్చే నీరుగా మారుస్తారు. ఈ నీటిని ప్రాజెక్టుల కాల్వలకు, చెక్‌డ్యాంలకు, చెరువులకు సరఫరా చేస్తారు. సాగులో ఉన్న పంటలకు ఈ నీటిని తడులుగా అందించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Related Posts