YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జాతీయ ఉపాధి హామీ పథకం  నిధులకు మోక్షం

జాతీయ ఉపాధి హామీ పథకం  నిధులకు మోక్షం

 నిధులకు మోక్షం (తూర్పుగోదావరి)
కాకినాడ, నవంబర్ 11  జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) అనుసంధానంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులకు అడుగులు పడలేదు. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. 190 కోట్లు కేటాయిస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులకు చేరాయి. ఇప్పటి వరకు జిల్లాలో 3,000 కి.మీ. వరకు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఈ నిధులతో మరిన్ని కిలోమీటర్ల ..మిగతా 9లోమేర సీసీ రోడ్లు సాకారం కానున్నాయి. 2020 మార్చి నాటికి ఈ పనులను పూర్తి చేయాలని ప్రణాళికలు తయారు చేశారు. రెండు వేల జనాభా లోపు ఉన్న గ్రామాల్లో 90 శాతం నిధులు ఉపాధి హామీ పథకం నుంచి, 10 శాతం నిధులు స్థానిక సంస్థల నుంచి కేటాయించనున్నారు. రెండు వేల నుంచి తొమ్మిది వేల లోపు జనాభా ఉన్నచోట్ల 70:30 వాటాతో పనులు చేపడతారు. తొమ్మిది వేల జనాభా పైగా ఉన్నచోట 50:50 వాటాతో పనులు చేయనున్నారు. స్థానిక సంస్థలు భరించాల్సిన నిధులను ఆర్థిక సంఘం, ఇతర పథకాల నుంచి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెలాఖరు నాటికి ప్రతిపాదనలు సేకరించి, కలెక్టర్‌ నుంచి పనులకు పరిపాలనామోదం తీసుకోనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి సంబంధించి ఇంకా 250 వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయి. జిల్లాలో 1,270 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిలో చాలాచోట్ల సొంత భవనాల్లేవు. సామాజిక భవనాలను కూడా తాత్కాలికంగా సచివాలయాల నిర్వహణకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 230 గ్రామ సచివాలయ భవనాలను జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నిర్మించాలని తలపెట్టారు. దీనికోసం రూ. 82 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వీటిని నిర్మించాలని సంకల్పించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి జిల్లాలో కూడా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో 4,500 ప్రభుత్వ పాఠశాలుండగా.. వాటిలో 1,381 పాఠశాలల్లో ఈ పథకం కింద మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించనున్నారు. వీటిని జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టనున్నారు. ఈ పనులకు సుమారుగా రూ. తొమ్మిది కోట్ల వరకు నిధులు కేటాయించనున్నారు. ఈ పథకం కింద గుర్తించిన పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సర్వే చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Related Posts