ఆదర్శంగా నిలిచిన ఆదివారంపేట
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి నవంబర్ 11:
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పంచసూత్రాలను పాటించడంలో ఆదివారంపేట గ్రామం రాష్ట్రానికి మరియు జిల్లాకు ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. పారిశుద్ద్యం పై జిల్లాలో నెల రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సోమవారం రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం పరిశీలిస్తూ ప్రతి ఇంటిలో పంచసూత్రాలను పాటిస్తూ స్వచ్చ గ్రామంగా ఆదివారంపేట గ్రామం తీర్చిదిద్దడం పట్ల కలెక్టర్ తన సంతోషం వ్యక్తం చేసారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో పంచసూత్రాల అమలు తీరును గమనించిన జిల్లా కలెక్టర్ ప్రతి ఇంటికి పంచసూత్రాలకు సంబంధించిన స్టికర్ అంటించారు. గ్రామంలోని ఎస్సి కాలనీలొ కలెక్టర్ పర్యటించి పరిసరాల పరిశుభ్రతను గమనించి నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వనరా వనంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతి ఆవరణలో ఎర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చ భారత్ మిషన్ లో పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయిలో 3 అవార్డులు లభించాయని, వాటిని ప్రజల పక్షాన తాను స్వీకరించడం జరిగిందని అన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కృషి ఫలితంగా మన జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. మన జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంకుడుగుంత నిర్మించి మురుగుకాల్వలను మూసివేయడం ద్వారా గతం కంటే ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 80% మేర డెంగ్యూ కేసులు తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా స్వచ్చత అంశంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, అదే సమయంలో జిల్లాలోని మిగిలిన గ్రామాలకు పంచసూత్రాల అమలు విషయంలో ఆదివారంపేట ఆదర్శంగా నిలిచిందని, స్వచ్చత అంశంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికసంస్థ ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో మంచి కృషి చేసారని కలెక్టర్ ప్రశంసరించారు. ఆదివారం పేట గ్రామ ప్రజలు పంచసూత్రాల కార్యక్రమాన్ని పకడ్భందిగా అమలు చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యులయ్యారని అన్నారు. పంచసూత్రాల కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ఇంకుడగుంత, కాంపోస్ట్ పిట్, కిచెన్ గార్డెన్ ఎర్పాటు చేసుకునేలా పంచసూత్రాల కార్యక్రమం ప్రారంభించామని, ఆదివారం పేట గ్రామంలో ప్రతి ఇంటిలో కాంపోస్ట్ పిట్, ఇంకుడుగుంత, మరుగుదొడ్డి, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నామని, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. మన గ్రామంలో వచ్చిన మార్పు సుస్థిరంగా కొనసాగాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు మారినప్పటికి మనం ఏర్పాటు చేసుకున్న మంచి విధానాలు కొనసాగించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. మన గ్రామంలో చెత్త నిర్వహణ బాగా నిర్వహించాలని, తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, గాజు/ఐరన్ వస్తువులను ప్రత్యేకంగా విడదీసి సేకరిస్తున్నామని, దీని కోనసాగించాలని కలెక్టర్ అన్నారు. గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం పట్ల సైతం శ్రద్ద వహించాలని, మహిళలు నెలసరి సమయాల్లో వినియోగించేందుకు ప్లాస్టిక్ రహిత శానిటరీ న్యాపకిన్ ను జిల్లాలో తయారు చేస్తున్నామని, వీటిని వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆదివారం పేట గ్రామంలో జరిగిన కార్యక్రమాల పట్ల తనకు చాలా సంతృప్తి ఉందని, ఇక్కడ మార్పుకు కృషి చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, భాగస్వామ్యం అయిన ప్రజలకు కలెక్టర్ అభినందంనలు తెలిపారు. ప్లాస్టిక్ అధికంగా వినియోగించడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, ప్లాస్లిక్ వల్ల నీరు భూమిలో ఇంకిపోకుండా నిల్వ ఉంటుందని, దాని వల్ల ప్రమాదకరమైన దోమలు వస్తున్నాయని, ప్లాస్టిక్ వినియోగం మనం గ్రామాలో నిషేదించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్లాస్టిక్ స్థానంలో మనం బట్ట సంచులను వినియోగించుకోవాలని అన్నారు. ఆదివారం పెట గ్రామంలో ఐకేపి కోనుగొలు కేంద్రం, బోర్ వెల్, అవసరమైన అంతర్గత రొడ్లను జిల్లా కలెక్టర్ మంజూరు చేసారు. తడి చెత్తను ఉపయోగించుకుంటు కాంపోస్ట్ పిట్ ద్వారా ఎరువుల తయారీ విధానం పై స్వశక్తి సంఘాల మహిళల ప్రతినిధి గ్రామ ప్రజలకు వివరించారు. పంచసూత్రాలను పకడ్భందిగా అమలు చేయడంలో కృషి చేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను కలెక్టర్ సత్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్డిని కలెక్టర్ ప్రారంభించారు. స్వశక్తి సంఘాల ప్రత్యేక అధికారి ప్రేమ కుమార్, మండల ప్రత్యేక అధికారి మల్లెశం, రామగిరి ఎంపడిఒ ప్రసాద్, గ్రామ సర్పంచ్ కుమార్, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.