Highlights
- టేకాఫ్ అయిన కొద్ది సేపటికే దుర్ఘటన
- ఐదుగురు ఫిలిప్పీన్స్ మృతి
- నేలపై కూలిన ఘటనలో మరో ఐదుగురు దుర్మరణం
మనీలాకు ఉత్తరంగా ఆరు సీటర్ల చిన్న విమానం ఒక ఇంటిపై శనివారం కూలిపోవడంతో మొత్తంగా పది మంది మరణించారు. విమానంలో వున్న ఐదుగురు ఫిలిప్పీన్స్ జాతీయులు మృతి చెందగా, నేలపై కూలిన ఘటనలో మరో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన సంభవించింది. పైపర్ - 23 అపాచి విమానం బులకన్ ప్రావిన్స్లోని ప్లారిడెల్ పట్టణంలో విమానాశ్రయం నుండి బయలుదేరిందని, కాసేపటికే ఇంటిపై కూలిపోయిందని పౌర విమానాయాన శాఖ ప్రతినిధి ఎరిక్ అపోలనియో తెలిపారు. విమానం కూలగానే పెద్ద మంట వచ్చిందని, ఆ మంటలకు ఇల్లు ఆహుతై పోయిందని, అందులో ఐదుగురు చనిపోయారని, మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు.ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. విమానం ముందుగా చెట్టును, ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇంటిపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.