Highlights
జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి
గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు
చింతపల్లి మండలం బలపం పంచాయతీ
కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు
జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల
మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు
పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు
గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు
జామిగుడ పంచాయతీలోని 19 తండాలు
ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు
బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు
రంగబయలు పంచాయతీలోని 22 తండాలు
గిరిజన తండాలకు అశ్వాలు...
విశాఖపట్టణం, నవంబర్ 11,
కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది.గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్‌మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు.