నిర్లక్ష్యం వహిస్తే జరిమానాలు.. జప్తులు
‘ప్రజాభద్రత చట్టం’ చెబుతున్నది ఇదే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల దుర్ఘటన భాగ్యనగరానికి మరపురాని గాయాన్నే మిగిల్చినా.. భవిష్యత్తు తరాలకు మహత్తరమైన దిక్సూచిని అందించే బృహత్‌ప్రణాళికకు బలమైన పునాదిని పాదుకొల్పింది. రాష్ట్ర రాజధానిలో ఏకంగా పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే సంకల్పానికి వూపిరులూదింది. ఆ దుర్ఘటన సమయంలో నిందితులను గుర్తించడానికి పోలీసులు పడిన కష్టమే ఈ ప్రణాళికకు బీజం వేసింది. అప్పుడు ఓ ప్రైవేటు భవన సముదాయంలోని సీసీ కెమెరా కీలకమైన ఆధారాన్నిచ్చింది. ఆ సాక్ష్యమే కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష వేయించేందుకు దోహదపడింది. అంతేకాదు కీలకమైన ‘ప్రజాభద్రత-2013’ చట్టం రూపకల్పనకు నాంది పలికింది.
సమాజంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని చెప్పేందుకు ఎన్నో ఉదంతాలు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. నేరాలను ఛేదించడానికే కాకుండా.. నేరస్థుల్లో భయం కలిగించేలా ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పడం అతిశయోక్తి కాబోదు. అందుకే వీటి ఏర్పాటుకు ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే సుమారు 1.6 లక్షల కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది చివరికల్లా లక్ష అమర్చాలని రాచకొండ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసులూ ‘మేం సైతం’ అంటున్నారు. ఈ క్రమంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలతోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ తప్పనిసరి చేసే దిశగా పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. అవసరమైతే ప్రజాభద్రత చట్టం ప్రయోగించైనా సరే భారీ ఎత్తున ఈ కెమెరాలను అమర్చేలా ఒత్తిడి తీసుకురానున్నారు.
తప్పనిసరిగా ఉండాల్సిందే..
ఈ చట్టం ప్రకారం జనసంచారం ఉండే ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలను బిగించుకోవాలి.
* కనీసం వంద మంది గుమిగూడే ప్రతి ఎస్టాబ్లిష్‌మెంట్ (భవనం లేదా కార్యాలయం) వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన బడి, గుడి, షాపింగ్‌మాల్, పార్క్, సినిమాహాల్.. ఇలా అన్నిచోట్ల తప్పనిసరి.
* సంస్థ కార్యాలయం లేదా భవన సముదాయంలోకి ప్రవేశించే, నిష్క్రమించే మార్గాల్లో 50 గజాల దూరం వరకు దృశ్యాలను చిత్రీకరించేలా బిగించాలి.
* రాత్రివేళల్లోనూ దృశ్యాలను చిత్రీకరించేలా నైట్‌విజన్‌తోపాటు ఇన్‌ఫ్రారెడ్ సామర్థ్యం కలిగిన వాటినే అమర్చాలి.
* చిత్రీకరించిన దృశ్యాల్ని నెల రోజులపాటు నిక్షిప్తం చేసే ఏర్పాటు తప్పనిసరి.
* పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్లలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్‌ఎండీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ (హెచ్‌హెచ్‌ఎండీ), వెహికిల్ బాటమ్ సెర్చ్ మిర్రర్, బ్యాగేజీ స్కానర్, అవసరమైతే స్నిఫర్‌డాగ్‌లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
* ఈ వీడియో ఫుటేజీలను స్థానిక ఇన్‌స్పెక్టర్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కేసుల విచారణ నిమిత్తం ఎప్పుడైనా పరిశీలించొచ్చు. వీటి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కేసుల దర్యాప్తు కోసం కాకుండా ఇతరత్రా వినియోగిస్తే శిక్షార్హులవుతారు.
చర్యలు కఠినమే...
ప్రజాభద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. చట్టాన్ని అమలు చేయడం ఆరంభించాక ..నిర్లక్ష్యం వహించే వారిపై జరిమానాలు, జప్తులతో మోత మోగించనున్నారు.
* సీసీ కెమెరాలు లేని కార్యాలయాన్ని గుర్తిస్తే మొదటిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు.
* ఇలా రెండుసార్లు చిక్కిన తర్వాతా కెమెరాలు అమర్చుకోకపోతే మూడోసారి సదరు కార్యాలయాన్ని సీజ్ చేస్తారు.