గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ నవంబర్ 12
;: గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘550వ గురునానక్ దేవ్‌జీ జయంతి సందర్భంగా భారత ప్రజలందరికీ, ముఖ్యంగా దేశంలో ఉన్న, ఇతర దేశాలలో నివసిస్తున్న సిక్కు సోదరులకందరికీ శుభాకాంక్షలు’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. దయ, స్నేహభావాలతో కూడిన శాంతియుతమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి గురునానక్ బోధనలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని మరో ట్వీట్లో రాష్ట్రపతి పేర్కొన్నారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ట్విటర్ వేదికగా ప్రజలకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్వితీయమైన భారతీయ సంస్కృతిలోని ఆధ్యాత్మిక విషయాలను సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా గురునానక్ జీ వివరించారని, వారిని మరింత చేరువ చేశార’ని ట్వీట్ చేశారు. మూఢనమ్మకాలను, రెచ్చగొట్టే భక్తి భావజాలాన్ని నానక్ వ్యతిరేకించారని, అంతటి గొప్ప వ్యక్తి జయంతి అయిన ఈ రోజున ఆయన వెలిగించిన మానవత్వం, జ్ఞానాల దివ్య జ్యోతులు శాంతి, కరుణలతో కూడిన జీవితాన్ని మానవాళి గడిపేందుకు దారి చూపాలని వెంకయ్యనాయుడు కోరుకున్నారు.ఇదిలా ఉంటే గురు పూర్ణిమ సందర్భంగా గురునానక్ జయంతిని వైభవంగా జరుపుకొనేందుకు వందలాది మంది భక్తులు గురుద్వారకు తరలివచ్చారు. ఈ వేడుకల కోసం గురుద్వార ఆలయం అంతటా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.