నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ నిర్మాణాలు
మెదక్,
రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఫారెస్ట్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కళాశాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి అనుమతించారు. పూర్తిగా హెరిటేజ్ ఆకారంలో ఉండేవిధంగా రూపొందించిన ఈ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పజెప్పారు.ప్రభుత్వ ఆదేశాలతో ఆగమేఘాలపై సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాల పురోగతి నత్తనడకన సాగుతోంది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదలచిన ఫారెస్ట్ కాలేజ్ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి కావడం లేదంటే అభివృద్ధి కార్యక్రమాల అమలు పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా నిర్మాణం జరుగుతున్న అనేక కార్యాలయాలు నిర్మాణ పనులకు అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో పనులు మధ్యలో నిలిచి పోతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం సకాలంలో నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఈ కార్పొరేషన్ ఈ నిర్మాణాల ద్వారా రావలసిన నిధులు రాకుండా నిలిచిపోతున్నాయి. దీం తో వందలాది మంది ఉద్యోగులు గల ఈ కార్పొరేషన్ నష్టాల బారిన పట్టి భవిష్యత్తులో సంస్థ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కేవలం పోలీస్‌శాఖకు చెందిన వివిధ భవనాలు, కార్యాలయాల నిర్మాణాల ను చేపడుతుంటారు. ఈ కార్పొరేషన్ ద్వారా నిర్మాణాలు జరుగుతుం డడంతో ప్రతి నిర్మాణానికి పదిశాతం చొప్పున కమిషన్‌గా ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంతోనే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వాహణ ఖర్చులను వ్యయం చేస్తుంటారు. గజ్వేల్‌లో నిర్మాణంలో ఉన్న ఫారెస్ట్ కాలేజీతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణాలను ఈ హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టింది. పనులు ప్రారంభించిన తర్వాత నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతూ మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫారెస్ట్ అకాడమీలో నడుస్తున్న ఈ కాలేజీ నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో 2017 సంవత్సరం అక్టోబర్‌లో ఈ నిర్మాణపనులను ప్రారంభిం చారు. అయితే ఈ నిర్మాణాలలో కాలేజీతో పాటు రీసెర్చ్ సెంటర్, విద్యార్థులకు హాస్టల్ సదుపాయాలు, ఉద్యోగులకు నివాస వసతి ఇక్కడే ఉండాలని నిర్ణయించి స్థలాన్ని ఎంపిక చేశారు.సకాలంలో ఈ భవనాన్ని పూర్తి చేసి కళాశాల తరగతులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశాలు అందడంతో కార్పొరేషన్ అధికారులు పనులను ప్రారంభింపజేశారు. అయితే సుమారు రూ. 100 కోట్లు వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కళాశాల భవనాల నిర్మాణాలలో 40 శాతం పూర్తయినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. బిల్లులు తయారుచేసి ఎన్నిసార్లు సమర్పించినా నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.సాధారణంగా 20 శాతం పనులు పూర్తి అయ్యినప్పటినుంచి నిధులు విడుదల చేస్తుంటారని అయితే ఈ నిర్మాణంలో 40 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయినా బిల్లుల చెల్లింపులకు నిధులు విడుదల కాకపోవడంతో సకాలంలో ఈ పనులు పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. టెండర్లు పొందిన నిర్మాణ సంస్థలు కూడా బిల్లులు చెల్లింపు కోసం అధికారులపై ఒత్తిడి తెస్తుండడంతో కార్పొరేషన్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 13 జిల్లాల్లో ఏర్పాటు చేయదలచిన జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మాణాలు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. రూ. 15 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ కార్యాలయాలలో జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు సూపరిండెంట్ క్యాంపు ఆఫీసు కార్యాలయం సిబ్బంది వసతి సదుపాయం తదితర నిర్మాణాలను చేపట్టారు. సుమారు రూ.195 కోట్లతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఈ నిర్మాణాలలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది.కనీసం 30 నుంచి 40 శాతం పనులు కూడా పూర్తి కావడం లేదని దీంతో ఈ కార్యాలయ భవనాల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల నిర్మాణ సంస్థలు కూడా తమకు వ్యయం పెరుగుతోందని, ముందుగా ఒప్పందం చేసుకున్నందున నిర్మాణ వ్యయం పెరగడానికి కూడా అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నిర్మాణాలు పూర్తయితే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు రావలసిన 10 శాతం నిధులు వస్తాయని కోట్లాది రూపాయలకు సంబంధించిన బిల్లులకు నిధులు విడుదల కాకపోవడంతో సంస్థకు రావలసిన ఆదాయం కూడా రావడం లేదని ఇది సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.