విముక్తి కోసం మళ్లీ బలిదానాలు.. బీజేపీ లక్ష్మణ్
హైదరాబాద్ నవంబర్ 12
‘ఉమ్మడి సివిల్ కోడ్, ఎన్నార్సీని సమయం వచ్చినప్పుడు తప్పకుండా కేంద్రం అమల్లోకి తెస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రామమందిరం నిర్మాణానికి సానుకూల పరిష్కారం లభించినా యజ్ఞాలు, యాగాలు చేసే వారు మాత్రం నీరు మెదపడం లేదు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోసం మళ్లీ బలిదానాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని నిరంకుశ పాలన సాగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను భుజాన మోసుకొని నడుస్తున్నది బీజేపీనే. ఆర్టీసీ కార్మికుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. నిర్బంధాలతో, పోలీసు ఆంక్షలతో పోరాటాలను ఆపలేరు’ అని చెప్పుకొచ్చారు.‘దేశం మొత్తం మీద కమలం వికసిస్తున్నది.. కాషాయ జెండా రెపరెపలాడుతున్నది. తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.. 370 ఆర్టికల్ రద్దు ద్వారా రావణకాష్టంగా రగులుతున్న 70 ఏళ్ల సమస్యను ప్రధాని మోదీ శాశ్వతంగా పరిష్కరించారన్నారు. అయోధ్య సమస్యకు సైతం సామరస్య పరిష్కారం చూపారని లక్ష్మణ్ తెలిపారు.