అమెరికా లోనూ హాట్ టాపిక్ గా నడుస్తోన్న ఆర్టీసీ సమ్మె
న్యూజెర్సీ లో కేసీఆర్ ఫ్యామిలీ పై ఫైర్ బ్రాండ్ నిప్పులు
హైదరాబాద్
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న వైనంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ లోనే కాదు.. అమెరికా లోనూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. తెలంగాణ సమూహం ఉన్న చోట్ల ఈ ఇష్యూ బాగా హైలెట్ అవుతోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అమెరికా లో పర్యటించిన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ ఆర్ ఐలు సేవ్ ఆర్టీసీ అంటూ చేసిన నిరసన తెలిసిందే. తాజాగా న్యూజెర్సీ లో పర్యటిస్తున్న మల్కాజ్ గిరి ఎంపీ కమ్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పైన విరుచుకు పడ్డారు.ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు అనురిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు రేవంత్ రెడ్డి. ప్రజలు ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదని.. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. సివిల్ వార్ కు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతుందన్నారు. అమెరికా లోని న్యూజెర్సీ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ ప్రసంగంలో అత్యధికం తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశమే ఉంది.
కేసీఆర్ పాలనే బాగుంటే ఆయన కుమార్తె నిజామాబాద్ లో ఓడి పోవటం ఏమిటి? రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లో గెలవటం ఏమిటి? అని ప్రశ్నించారు. తాను కొడంగల్ లో ఓడిపోతానని కానీ.. మల్కాజిగిరి లో గెలుస్తానని కానీ అనుకోలేదన్నారు.ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫేస్టో లో తాము చెప్ప లేదని సీఎం కేసీఆర్ అంటున్నారని.. కానీ ఆర్టీసీని 50 శాతం ప్రైవేటీకరణ చేస్తామని కూడా ఎన్నికల వేళలో చెప్పలేదన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. గతంలో అభివృద్ధి కి నక్సలైట్లు అడ్డు.. వారు ఉండ కూడదని రైటిస్టులు భావించే వారని.. ఇప్పుడు నక్సలైట్లు ఉంటే ప్రభుత్వ చర్యల్ని నియంత్రించేవారేమో అని సమాజం అనుకునే పరిస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు.కేసీఆర్ కుటుంబ సభ్యుల పైనా రేవంత్ మండి పడ్డారు. కొడుకు.. కూతురు వచ్చి పప్పన్నం తిని వెళ్లిపోయారని.. బెంజ్ కారులో వచ్చి కూతురు బతుకమ్మ ఆడి పోయిందని.. ఇంత మాత్రానికే ఉద్యమం లో ఉన్నామని చెప్పుకుంటే.. ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ల కుటుంబాలు ఏమనాలి? ఏమిచ్చి వారి రుణం తీర్చు కోవాలని కేసీఆర్ పై మండి పడ్డారు. ఆసక్తికర మైన విషయం ఏమంటే.. కేసీఆర్ ను ఆయన కుమార్తె.. కుమారుడ్ని ఏదో రకంగా సెటైర్ వేసిన రేవంత్.. మేనల్లుడు హరీశ్ ను ఉద్దేశించి ఒక్కమాట కూడా అనక పోవటం గమనార్హం.