పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం
- మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నవంబర్ 12
తెలంగాణ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడమే కాకుండా వారిని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీమాతో కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని, దేశంలో కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న ఒకటి రెండు పార్టీలలో టిఆర్ఎస్ పార్టీ ఒకటని ఆయన అన్నారు. కార్యకర్తలకు భీమా కోసం ఈ ఏడాది రూపాయలు 11.50 కోట్ల బీమా కంపెనీకి పార్టీ తరఫున చెల్లించడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ పార్టీ రెండవసారి అధికారంలోకి రావడానికి చిత్తశుద్ధి గల పార్టీ కార్యకర్తలు ప్రధాన కారణమని ఆయన అన్నారు. బీమా సొమ్ము అందజేయడం తోనే పార్టీకి మీ కుటుంబాలతో ఉన్న రుణం తీరిపోదని, అన్ని సమయాల్లో పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు చనిపోయిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దొంతి కుంట తండా కు చెందిన సేవ్య భార్య కమలమ్మ కు, రేవల్లి కు చెందిన భార్యకు లక్ష్మికి రెండు లక్షల రూపాయల చొప్పున మంజూరైన చెక్కులను ఆయన వారికి అందజేశారు.