శివసేనకు షాకిచ్చిన బీజేపీ
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు
ముంబై, నవంబర్ 12,
మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన తన మిత్రపక్షం శివసేనకు బీజేపీ దిమ్మతిరిగే షాకిచ్చింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ విషయమై చర్చించిన కేంద్ర కేబినెట్.. రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపింది.కాగా.. రాష్ట్రపతి పాలన విధిస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు శివసేన సన్నద్ధం అవుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్‌లతో ఉద్ధవ్ థాక్రే చర్చించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.మహరాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా.. బీజేపీ 105 సీట్లు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెలుపొందాయి. 13 మంది స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. ఇరు పార్టీలు కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నాయి.కానీ ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఎం పదవిని చెరో రెండున్నరేళ్ల కాలానికి పంచుకుందామని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందం ఏదీ లేదని బీజేపీ నేతలు చెప్పారు. అసెంబ్లీ తుది గడువు ముగుస్తుందనగా.. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే.. శివసేనకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ తేల్చి చెప్పడంతో.. ఎన్డీయే కూటమి నుంచి శివసేన వైదొలిగింది. కానీ గవర్నర్ ఇచ్చిన గడువులోగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను సమర్పించడంలో ఆ పార్టీ విఫలమైంది. అనంతరం గవర్నర్ ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ గడువు ముగియక ముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం గమనార్హం.రకరకాల మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం రాష్ట్రపతి పాలన దిశ మళ్లింది. సైద్ధాంతిక విబేధాలున్న శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఎలా మద్దతు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశమై.. తర్జనభర్జనలు పడింది. బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈలోగానే పుణ్యకాలం గడిచిపోయింది. శివసేనకు గడువు పెంచడానికి గవర్నర్ నిరాకరించారు. బీజేపీని దెబ్బకొట్టే అవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా మరోసారి పోగొట్టుకోగా.. కమలనాథులు తమకు దక్కని సీఎం పీఠాన్ని ఎవరికి దక్కకుండా చేయడంలో సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు.