
రాజస్థాన్ లో విషాదం..వేల సంఖ్యలో పక్షల మృతి
జైపూర్ నవంబర్ 12
రాజస్థాన్ లోని సాంబార్ సరస్సు వద్ద విషాదం నెలకొంది. సుమారు వెయ్యికి పైగా పక్షులు మృతి చెందాయి. అధికారులు వెయ్యి పక్షులు మృతి చెందాయని చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం 5 వేల పక్షులు మృతి చెందాయని చెబుతున్నారు. విదేశాలకు చెందిన రంగు రంగుల పక్షులు.. శీతాకాలం రాగానే సాంబార్ సరస్సు వద్దకు చేరుకుని పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. సుమారు 20 వేల వరకు వలస పక్షులు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఏమైందో కానీ వలస వచ్చిన పక్షుల్లో నాలుగో వంతు చనిపోయాయి. ఆదివారం సాంబార్ సరస్సు వద్దకు చేరుకున్న పక్షి ప్రేమికులు.. పక్షులు విగతజీవులుగా పడిపోవడాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కాలుష్యమా? బర్డ్ ఫ్లూ సోకిందా? అయితే సాంబార్ సరస్సు వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్టుమార్టం నిమిత్తం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.