నిన్న ఇసుక... ఇవాళ సిమెంట్
విజయవాడ,
ఏపీలో విపక్షానికి మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఈ ఆరు నెలల్లో జగన్ ఎక్కడ జారుతాడోనని వేయి కళ్ళతో ఎదురుచూసిన పార్టీలకు ఇసుక రూపంలో దొరికేశారు. దాంతో గత మూడు నెలలుగా ఇసుక పోరాటాలు మొదలుపెట్టి లాంగ్ మార్చు, దీక్షలు అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. అయితే ఏపీలో ఇపుడు మెల్లగా ఇసుక సమస్య ఒక కొలిక్కి వస్తోందని తెలుస్తోంది. ఇంతకు ముందు రోజుకు 40 టన్నుల ఇసుక సరఫరా జరిగితే ఇపుడు అది లక్ష టన్నులకు పెరిగింది. రానున్న రోజుల్లో మరింతగా సరఫరా అవుతుందని అపుడు ప్రతిపక్షాల నోళ్ళు పూర్తిగా మూతపడతాయని జగన్ సర్కార్ ఆశాభావంతో ఉంది. అయితే ఇసుక సమస్యపైన ఓ విధంగా సర్కార్ ని అల్లరి పాలు చేశామన్న సంతృప్తి విపక్షాల్లో ఉంది. పవన్ ఓటమి తరువాత మళ్ళీ పొలిటికల్ గా రీచార్జ్ కావడానికి ఇసుక ఓ ఆయుధంగా మారిన సంగతి విధితమే.ఇసుక సమస్య తీరితే భవన నిర్మాణ రంగం కార్మికులకు పని దొరుకుతుందని, ఇక ఆ వర్గం నుంచి తమకు విమర్శలు ఉండవని వైసీపీ ప్రభుత్వం ఓ వైపు అంచనాలు వేసుకుంటూంటే నిర్మాణ రంగానికి మరో ప్రధాన ముడి సరుకు అయిన సిమెంట్ రేటు ఇపుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇన్నాళ్ళు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ఇపుడు మెల్లగా కొరత తీరడంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాంతో సిమెంట్ కు రెక్కలొచ్చిపడ్డాయి. బస్తాకు 20 నుంచి 30 శాతం రేట్లు పెరగడంతో నిర్మాణ రంగంపై పెను ప్రభావం పడుతోంది. ఇంతకాలం ఇసుక కోసం ఆపిన పనులు మొదలుపెట్టాలనుకుంటున్న మధ్యతరగతి వర్గీయులకు కూడా సిమెంట్ మంటలు పెట్టేస్తోంది. ఇలా సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెరగడానికి డిమాండ్ తో పాటు, డీలర్ల బ్లాక్ మార్కెట్ వైఖరి అని కూడా అంటున్నారు. అంటే ఉన్న సమయంలోనే డిమాండ్ ని సొమ్ము చేసుకుందామన్న కంపెనీల దురాలోచన, డీలర్ల చేతి వాటం వెరసి సిమెంట్ ధరలు చెట్టెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం సిమెంట్ బస్తా ఒక్కటి 380 రూపాయలు పలుకుతోందిట.నిజానికి చాలా సిమెంట్ కంపీనీలు ఆర్ధిక మాంద్యం నేపధ్యలో ఉత్పత్తిని తమకు తాముగా తగ్గించుకున్నాయి. దాంతో మార్కెట్ లోకి సిమెంట్ సరఫరా ఒక్కసారిగా బాగా తగ్గింది. ఇపుడు మళ్ళీ నిర్మాణాలు ఊపందుకుంటున్న వేళ సిమెంట్ బంగారమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో గట్టిగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటి నుంచే అప్రమత్తం కాకపోతే ఇసుక కంటే దారుణంగా సిమెంట్ ధరాభారంతో నిర్మాణ రంగ కుదేలు అవుతుందని అంటున్నారు. జగన్ కనుక సిమెంట్ ధరలను నియంత్రించి పరిస్థితిని నియంత్రించకపోతే మరో మారు సిమెంట్ కొరత అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు విపక్షాలు రోడ్డెక్కడానికి సిధ్ధంగా ఉంటాయి. పైగా ముఖ్యమంత్రికి సొంతంగా సిమెంట్ కంపెనీలు ఉండడం కూడా వివాదం మరింతగా రాజుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జనం కూడా నమ్మే అవకాశం ఉంటుంది.