YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నత్తనడకన దమ్ముగూడెం ప్రాజెక్టు..

నత్తనడకన దమ్ముగూడెం ప్రాజెక్టు..

నత్తనడకన దమ్ముగూడెం ప్రాజెక్టు..
ఖమ్మం, నవంబర్ 13,
ప్రభుత్వాలు ఎన్ని మారినా దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. ఒక్కో ప్రభుత్వం ఒక్కో తీరున ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి కాలయాపన చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. పద్నాలుగేండ్లలో అంచనాలకు మించి ప్రాజెక్టు వ్యయం రెట్టింపు అయింది. కానీ పొలాల్లోకి మాత్రం నీళ్లు రాలేదు. తెలంగాణ సర్కారయినా ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లిస్తుందని ఆశించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి.కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2500 కోట్లు ఖర్చుచేసి సుమారు తొమ్మిదేండ్లు నిర్మాణం చేపట్టిన రాజీవ్‌ సాగర్‌ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చరమగీతం పాడింది. డిజైన్‌ సరిగాలేదని రీడిజైన్‌ చేసింది. దీనికి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.7వేల కోట్ల అంచనాతో పనులను ప్రారంభించింది. ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని సుమారు 6లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2500కోట్లు ఖర్చయితే.. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వ హయాంలో మరో రూ.15,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా అంచనా వ్యయం పెరుగుతున్నప్పటికీ.. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో, ఉమ్మడి జిల్లాలసేద్యానికి సాగునీరు ఎప్పుడు అందుతుందోనన్న విషయం అంతుపట్టడం లేదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని కుమ్మరిగూడెం సమీపంలో గోదావరి నదిపై 1857లో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరిపై ఈ ఆనకట్ట నిర్మించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది దుమ్ముగూడెం ఆనకట్టగా విరాజిల్లుతోంది. 
సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని ఖమ్మం జిల్లా రైతాంగ సాగునీటి అవసరాలు తీర్చేందుకోసం దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఓ ప్రాజెక్టు కట్టాలని రెండు దశాబ్దాల క్రితం సీపీఐ(ఎం) ఉద్యమాలు చేసింది. వందలాది కిలో మీటర్ల పాదయాత్రలు చేసింది. ఈ ఉద్యమ స్పూర్తిని తీసుకున్న జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు అదే నినాదాన్ని అందుకున్నాయి.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎట్టకేలకు గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించేందుకు 2005 డిసెంబర్‌ 31న అమ్మగారిపల్లి పంచాయతీలోని కుమ్మరిగూడెం గోదావరి ఆనకట్ట వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1681 కోట్ల అంచనా. ఈ ప్రాజెక్టును 2014 వరకు పూర్తిచేయాలనే లక్ష్యం పూర్తికాలేదు. అప్పటికే కాంగ్రెస్‌ పాలన ఓ ఐదేండ్లు ముగిసి పోయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించడం, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో ప్రాజెక్టు పనులు అలాగే నత్తనడకన కొనసాగాయి. నిర్మాణ వ్యయం మాత్రం అనుకున్న దానికంటే పెరిగి పోయింది. రూ.1681 కోట్ల నుండి ఏకంగా రూ. 2500 కోట్ల వరకు పెరిగి పోయింది. ఆనాటి అధికారుల లెక్కల ప్రకారం 60శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్టు సమాచారం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది.

Related Posts