Highlights
- ఖాతాలు 10,475
- దోచుకున్నది రూ.1,16,262 కోట్లు
- ఆర్.బి.ఐ. చట్టమే అడ్డు
- కొండెక్కిన 'నిఘా'
కార్పోరేట్ రంగం పేరుతో బ్యాంకుల మీద పడి దోచుకోవడంతో ఈ దొంగలు దొరల్లా మారి.. మిలియనీర్లు, మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లు, మల్టీ బిలియనీర్లుగా మారారు.అదే పాతకాలంలో కిలాడీలు, కేటుగాళ్ళు, దొంగలు, టక్కరి దొంగలు, గజ దొంగలు, ఘరానా దొంగలు, బందిపోట్లు... గ్రామాలపై తెగబడి ఊరి సంపద దోచుకుని పరారయ్యేవారు.
"బ్యాంకులలో ఫారాలు నింపేందుకు ఉంచే ఒక్క రూపాయి విలువ చేసే పెన్నును దారంతో గట్టిగా బిగిస్తారు. మరి ఇంతలా జాగ్రత్తపడే బ్యాంకులు.... వేల కోట్ల రూపాయల విషయంలో ఎందుకు మోసపోతున్నాయి"
దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులు కలిపి 16,844 ఖాతాలకు రూ.2,59,991 కోట్లు రుణాలను ఇచ్చాయి.ఇందులో 10,475 ఖాతాలు అప్పు ఎగవేతకోసం తెరిచిన ఖాతాలే. వీటి వలన అక్షరాలా
రూ. 1,16,262 కోట్లను పెద్దమనుషుల ముసుగులో దర్జాగా దోపిడీ చేశారు. బ్యాంకు సొత్తును తమ బొక్కసాలలో కుక్కేసుకున్నారు. రక్షణ కోసం రాజకీయుల పంచన చేరి ప్రతిరోజూ 'ఉగాది పండుగ' చేసుకుంటున్నారు.ఈ 'దోపిడీ ముఠా' చేసే ఆర్థిక నేర ఇతివృత్తం మాత్రం అంతటా ఒకేలా ఉంటుంది. అన్నీ బినామీ, డొల్ల, డబ్బా కంపెనీలే. బ్యాంకు అధికారులకు గతంలో పర్సంటేజీలు ఉండేవి. కాలక్రమేణా వారి భాగస్వామ్యంతోనే కోట్లు కొల్లగొట్టడానికి రాచమార్గం ఏర్పాటు చేసుకున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో 2015 నాటికి 764 కంపెనీలు చెల్లించని రుణాల విలువ 9,204 కోట్లు. కాగా డిసెంబర్ 2017 నాటికి 1118 ఖాతాలలో రూ. 15,894 కోట్ల రుణం గాలిలో కలిసిపోయింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) :
(1,735 ఖాతాల ద్వారా రూ .29,916 కోట్లు,
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ. 1,286 కోట్లు, కాలిక్స్ కెమికల్స్ రూ. 327 కోట్లు, జెబి డైమండ్ రూ. 208 కోట్లు, స్పాన్కో రూ .347 కోట్లు, జెనిత్ బిర్లా రూ.139 కోట్లు), శ్రీమ్ కార్ప్ రూ. 283 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ. 378 కోట్లు, ఫస్ట్ లీజింగ్ రూ. 403 కోట్లు, జిఇటి ఇంజనీరింగ్ రూ.406 కోట్లు ఆరగించారు.
ఐడిబిఐ బ్యాంక్:
(రు. 5,959 కోట్లు) :
రీడ్ అండ్ టేలర్: రూ 206 కోట్లు, ఎస్ కుమార్ నేషన్వైడ్: రూ 834 కోట్లు, డెక్కన్ క్రానికల్: రూ.269 కోట్లు కొట్టేశారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
(914 ఖాతాలు రు. 8,914 కోట్లు):
రీడ్ అండ్ టేలర్: రూ. 236 కోట్లు,
ఫరెవర్ ప్రీసియస్ డైమండ్ రూ. 158 కోట్లు,
మోహన్ జెమ్స్ రూ .158 కోట్లు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్: రూ. 432 కోట్లు,
ఎబిసి కోట్ స్పిన్: రూ.362 కోట్లు
ఆ చట్టమే అడ్డు:
ఆర్బీఐ చట్టం, 1934 సెక్షన్ 45-E నిబంధనలన ప్రకారం అప్పు తీసుకున్న వారి వివరాలు వెల్లడించడం కుదరదు. దీంతో అప్పు ఎగవేతదారుల గురించి ప్రజలకు తెలిసే అవకాశం లేదు.
డబ్బా కంపెనీలకు డబ్బే డబ్బు
నీరవ్ మోడీ సంస్థల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ, ఐటీ శాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నాయి. ఆయనకు సంబంధించి దాదాపు 200 నకిలీ కంపెనీలు, బినామీ ఆస్తుల్ని ఇప్పటికీ ఈ సంస్థలు గుర్తించారు. ఇప్పటివరకు 105అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీ ఆధ్వర్యంలోని గీతాంజలి గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న 18 సంస్థల బ్యాలెన్స్ షీట్లను కూడా సీబీఐ నిశితంగా పరిశీలిస్తోంది.
రిటైర్మెంట్ తరువాత రింగు తిప్పాలని....
గోకుల్ నిథ్ శెట్టి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కోట్లు కుమ్మేసుకుందాం అనుకున్నాడు. మామూలుగా ఈ ఎల్ఓయు (లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్)ల
గడువు 90 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ గోకుల్ నాథ్ శెట్టి నిబంధనలను తుంగలో తొక్క పలు ఎల్ఓయుల కాలపరిమితిని 365 రోజులుగా పేర్కొన్నాడు. ఒక్కో ఎల్ఓయు ఇచ్చినప్పుడు వంద శాతం మార్జిన్ మనీని సంస్థలు బ్యాంకుకు చెల్లించాలి. నీరవ్ పాత కస్టమరే కాబట్టి ఆ అవసరం లేకుండా గోకుల్‌నాథ్ శెట్టి వ్యవహారాన్ని నడిపించాడు.
2017లో కేవలం 63 రోజుల వ్యవధిలో అతను 143 ఎల్ఓయులను జారీ చేసినట్లు తేలింది. సరాసరి రోజజుకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎల్ఓయులను జారీ చేశాడు. మొదట జారీ చేసిన 150 ఎల్‌ఓయుల విలువ రూ.6500 కోట్లు కాగా, తర్వాత జారీ చేసిన 143 ఎల్ఓయూల విలువ రూ.3000 కోట్లు.
రిటైర్మెంట్ తరువాత వాడుకునేందుకు వీలుగా లాగిన్, కోడ్ లు అన్నీ తన పరిధిలో పెట్టుకున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు.
జాబితా ఇదే..:
బ్యాంకు పేరు: ఋణ మంజూరు కోట్లలో:
ఎస్.బి.ఐ. 29,916
పంజాబ్ నేషనల్ బ్యాంకు
15,894
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,904
బ్యాంక్ ఆఫ్ బరోడా 7,942
యూనియన్ బ్యాంక్ 7,552
సెంట్రల్ బ్యాంక్ 6,998
ఓరియంటల్ బ్యాంక్ 6,996
యూకో బ్యాంక్ 6,994
ఆంధ్రాబ్యాంక్ 6,992
కెనరా బ్యాంక్ 6,990
ఐ.డి.ఐ.బ్యాంక్ 5,959
విజయాబ్యాంక్5,952
. ....పరిశోధన: అనంచిన్ని వెంకటేశ్వరరావు