ప్రైవేట్ వాహానాల దోపిడి
హైద్రాబాద్, నవంబర్ 13,
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ వాహనాల దోపిడీ 40 రోజులుగా యథేచ్చగా కొనసాగుతోంది. నగరాల్లో, పట్టణాల్లో 45 మంది ఎక్కాల్సిన బస్సులో 100 నుండి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. సిటీ బస్సుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో 50 రూపాయల వరకు వసూలు చేసే చార్జీ స్థానంలో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో బస్సులు లేకపోవడంతో సెవెన్ సీటర్ ఆటోల్లో 25 మంది వరకు, 10 మంది ప్రయాణించాల్సిన జీపుల్లో 25 నుండి 30 మంది వరకు, ముగ్గురు ప్రయాణించాల్సిన చిన్న ఆటోల్లో 8 నుండి 10 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎంత మంది జనం ఎక్కినా పోలీసులు కాని, ఇతర శాఖల అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. నడుస్తున్న బస్సుల విషయంలో ఆర్టీసీ చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. సాధారణ రోజుల్లో రోజూ 50 బస్సుల వరకు ఆర్టీసీ నడిపిన రూట్లలో ప్రస్తుతం అయిదుకు మించి బస్సులు నడవడం లేదు. అవి కూడా ప్రైవేట్ లేదా అద్దెబస్సులే నడుస్తున్నాయి.సమ్మె మొదలైనప్పటి నుండి అనేక ప్రాంతాల్లో ప్రయాణీకులు వెళుతున్న వాహనాలు చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనాల్లో ప్రయాణీకుల లోడ్ ఎక్కువగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్లు వాహనాలు నడపడం తదితర అంశాలు ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.వాహనాల్లో జనం కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తుండటంతో వృద్ధులు, గర్భిణీలు, చంటిపిల్లలతో వస్తున్న మహిళలు, చిన్నపిల్లలు తీవ్రమైన ఇక్కట్లకు గురవుతున్నారు.హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి, శంకర్‌పల్లి, ఆదిభట్ల, షాద్‌నగర్ తదితర రూట్లలో ప్రైవేట్ కాలేజీలు 500 పైగా ఉన్నాయి. వీటిలో చదువుకుంటున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు తమ ఇళ్ల నుండి కాలేజీకి వెళ్లడానికి, కాలేజీ నుండి ఇళ్లకు తిరిగి వెళ్లడానికి నా నా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాలికలు పడుతున్న బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుండి వివిధ జిల్లాలకు రోజూ వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీవ్రమైన అగచాట్లు పడుతున్నారు. అలాగే జిల్లా కేంద్రాల నుండి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇక్కట్లకు గురవుతున్నారు. మండల కేంద్రాల నుండి రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన ప్రజలు రవాణా వసతి లేకపోవడంతో ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల నుండి సమీపంలోని చిన్న గ్రామాలు, కుగ్రామాలకు వచ్చే, పోయే ప్రజలు నడిచి వెళ్లాల్సి వస్తోంది.ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు కార్మిక సంఘాలు పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు. ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో నలుగురు వ్యక్తులు కలిసినా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుకుంటున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అంటూ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.