మోహన్ భగవత్, జూపల్లితో చంద్రబాబు చర్చల మర్మం
హైద్రాబాద్, నవంబర్ 13
పరిచయాలు పాతవే.. కానీ, వాటికే కొత్త కలరింగ్. కొంగొత్త షేక్ హ్యాండ్స్. ఇదీ ఇప్పుడే ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పని. ఇటీవల ఆయన ఇద్దరు కీలక వ్యక్తులను రెండు కీలక ప్రాంతాల్లో కలిసి చర్చించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అంతేకాదు, ఇది కేవలం ఏపీ వరకే పరిమితం కాలేదు. అటు తెలంగాణ కూడా విస్తరించింది. మరి ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు జరిగింది? చంద్రబాబు పాత మిత్రులతో కొత్త పరిచాయాలు ఎందుకు కోరుకుంటున్నారు? ఆసక్తిగా మారింది. ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారు.ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఘోరమైన పరాజయం చవి చూశారు. బలమైన ప్రభుత్వంగా 151 సీట్లతో జగన్ సర్కారును ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెండు రకాలుగా పరీక్షలు ఏర్పడ్డా యి. ఒకటి పార్టీని నిలబెట్టుకోవడం, రెండు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం. పార్టీని నిలబెట్టుకునే క్రమంలో అనేక అవాంతరాలు వచ్చాయి. అధికారంలో ఉండగా చేసిన తప్పుల కారణంగా తమ్ముళ్లు అధికార పార్టీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అటు బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. దీంతో వీరిలో భరోసా కల్పించడం, పోయిన ప్రభను మళ్లీ రాబట్టుకుని జాతీయ నాయకుడిగా అవతరించడం చంద్రబాబు కు ముఖ్య లక్ష్యం.అదే సమయంలో తనంతట తానుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే.. పైనుంచి కూడా ఏదో ఒక రూపంలో ఒత్తిడి చేయగలగాలి. ఈ రెండు సాధించాలంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చెలిమి తప్పని పరిస్థితి. అయితే, బీజేపీకి, చంద్రబాబు కు చెడింది. ఈ క్రమంలోనే ఆయన పాత విషయాలను పక్కన పెట్టి.. కొత్తగా పరిచయాలు పెంచుకునేందుకు, తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిసినట్టు తెలుస్తోంది.ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీజేపీతో స్నేహం, రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద విధానాలను ఆయనతో చర్చించారని చర్చ జరుగుతోంది. మోహన్ భగవత్ తో చంద్రబాబుకి మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలోనూ వీరిద్దరూ పలు వేదికలపై కలిశారు. ఇక, అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కూడా దాదాపు గంట సేపు హైదరాబాద్ లో చంద్రబాబు చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి.రామేశ్వరరావుతోనూ చంద్రబాబు కు ఇప్పుడు కొత్తగా పరిచయం కాదు. చంద్రబాబు 2004కు ముందు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆయనకు అనేక కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే ఈ ఇద్దరు నేతలను కలవడం వెనుక కొత్తగా పరిచయాలను పుంజుకోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉంటుందని, రాబోయే రోజుల్లో దీని రిజల్ట్ బయటకు వస్తుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.