పయ్యావుల సైలెంట్ వెనుక....
విజయవాడ, నవంబర్ 14
టీడీపీలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గెలిచినా.. ఓడినా.. పార్టీలో కీలక రోల్ పోషించారు. వివాదాలకు దూరంగా, ప్రజలకు చేరువగా మెలిగిన నాయకుడిగా కూడా పయ్యావుల కేశవ్ పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఆయనకు ఎప్పుడు కాలం కలిసి రాలేదు. పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే… ఆయన ఓడినప్పుడు అధికారంలోకి రావడం కామన్ అయ్యింది. దీంతో ఆయన కీలక పదవులకు దూరం అయ్యారు.ఇక గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడినా పయ్యావుల కేశవ్ మాత్రం ఉరవకొండలో గెలిచారు. అయితే, ఇప్పుడు ఆయన అత్యంత కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్(పీఏసీ)గా పయ్యావుల కేశవ్ ఛాన్స్ కొట్టారు. దీని ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం రాజ్యాంగ బద్ధంగా సంక్రమించింది. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేసే విమర్శలకు, పీఏసీ చైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ చేసే విమర్శలకు చాలా తేడాతో పాటు ప్రాధాన్యం కూడా ఉంటుంది. అయినప్పటికీ.. పయ్యావుల కేశవ్ ఈ విషయంలో చొరవ చూపించలేక పోతున్నారు.ఎంత మృదు స్వభావి అయినప్పటికీ.. పరిస్థితులను బట్టి తనను తాను మార్చుకోవాల్సిన అవసరం రాజకీయాల్లో ప్రతి నాయకుడికి ఉంటుంది. అయితే, పయ్యావుల కేశవ్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసనలకు పిలుపు నిస్తున్నా.. కూడా పయ్యావుల కేశవ్ పెద్దగా పట్టించుకోవడం లేదన్న చర్చలు టీడీపీ వర్గాల్లోనే ఉన్నాయి. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు పీఏసీ చైర్మన్ పదవి మాకు వచ్చి ఉంటే.. పార్టీ వాయిస్‌ను జోరుగా వినిపించేవారమని చెవులు కొరుక్కుంటున్నారు. మరికొందరు ప్రభుత్వానికి చుక్కలు చూపించే వారమని కూడా అంటున్నారు.నిజానికి పార్టీలో ఈ పదవి కోసం చాలా మంది బాబుకు విజ్ఞాపనలు పంపారు. వీరిలో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కీలకంగా ఉన్నారు. ఈయన ఈ పదవి ఇవ్వాలని బాబును కోరినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా పరుచూరు ఎమ్మెల్యే, విద్యావంతుడు ఏలూరి సాంబశివరావు పేరు కూడా తెరమీదికి వచ్చింది. ఇక, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఇక సీనియర్ అయిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఈ పదవి కోసం పట్టుబట్టారు. అయినా కూడా చంద్రబాబు సీనియర్ దిగ్గజం అనే ఒకే ఒక క్వాలిఫికేషన్‌తో పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేశారు.అయితే, పయ్యావుల కేశవ్ ఇప్పటి వరకు ప్రభుత్వంపై తనదైన శైలిలో క్కడా విమర్శలు చేసింది కానీ, తప్పులు ఎత్తి చూపించింది కానీ లేక పోవడం గమనార్హం. దీనికి అనేక కారణాలు ఉన్నట్టు కూడా మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పయ్యావుల కేశవ్‌కు వైసీపీలోనే కొంతమంది నేతలతో ఆయనకు సాన్నిహిత్య సంబంధాలు, వ్యాపారాలు ఉన్నాయని అందుకే ఆయన ఈ పదవి ఉన్నా కూడా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని కూడా టీడీపీ వాళ్లే సందేహిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా పయ్యావుల కేశవ్‌కు పలు వ్యాపారాలు ఉండడం కూడా మరో కారణమంటున్నారు. ఇక ఆయన పార్టీ మారడం ఎలా ఉన్నా ఇటీవల ఆయన బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.