శివకుమార్, సిద్ధప్ప కలిసారోచ్..
బెంగళూర్, నవంబర్ 13
కర్ణాటక ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోనే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ వెళుతుంది. ఇటీవల జైలు నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్యతో కలిశారు. ఈ ఇద్దరి జోడీ కాంగ్రెస్ ను విజయపథాన నడిపిస్తుందని నమ్ముతున్నారు. పదిహేను స్థానాలను గెలిచి బీజేపీని అధికారం నుంచి తప్పించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది.ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి గత కొంతకాలంగా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతూనే పదిహేను స్థానాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో కాంగ్రెస్ ఒకింత ముందంజలోనే ఉంది. దాదాపు నెల రోజుల క్రితమే కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారు ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కు జరిగిన అన్యాయాన్ని వారు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.మిగిలిన తొమ్మిది స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది. వీటిలో పోటీ ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. కె.ఆర్.పేట, శివాజీనగర, యశ్వంతపుర, గోకాక్, విజయనగర్, కాగవాడ, అధణి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దీంతో ఆర్థిక, సామాజిక వర్గాల కోణంలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు కలసి మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. లోకల్ గా పట్టున్న నేతలకు అవకాశం కల్పిస్తేనే ఎన్నికల్లో గట్టెక్కగలమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతోనే ఉప ఎన్నికలు రావడంతో సానుభూతి ఎక్కువగా ఉందని పసిగట్టిన కాంగ్రెస్ ఈసారి కూడా నమ్మకమైన నేతలను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. విశ్వసనీయతకే పట్టం కట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది.