15న మోడీతో ఎల్వీ భేటీ
న్యూఢిల్లీ, నవంబర్ 13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం, సంచలనంగా మారింది. ఆయన ఢిల్లీ పిలుపు మేరకు, రెండు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అయితే, ఆయనకు ఆదివారం ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్ర పరిణామాలు నేపధ్యంలో, ప్రధాని మోడీ బిజీగా ఉండటంతో, ప్రధానితో భేటీకి కుదరలేదు అయితే, ఈ నెల 15న, ఆయనకు ప్రధాని మోడీ మరో అపాయింట్మెంట్ ఇచ్చారని, తెలుస్తుంది. ఈ నెల 14న మరోసారి ఎల్వీ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో ఏ అంశాల పై స్పందిస్తారు అనే విషయం మాత్రం తెలియటం లేదు. హస్తిన నుంచి పిలుపు రావటంతో, అటు వైపు నుండే అజెండా ఉండే అవకాసం కనిపిస్తుంది. మరో పక్క ఎల్వీ కూడా, తనా మనసులో మాట చెప్పే అవకాసం ఉంది.ముఖ్యంగా ఆయన కేంద్ర సర్వీసులకు వస్తాను అనే ప్రతిపాదన ప్రధాని ముందు పెట్టబోతున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానకరంగా సాగనంపిన తీరు గురించి ఆయన ఫిర్యాదు చేసి, రాష్ట్రం పై ట్రిబ్యునల్ లో పోరాడటానికి కూడా కేంద్రం దగ్గర సలహా తీసుకోనున్నారని తెలుస్తుంది. ఈ నెల నాలుగున, ఎల్వీని అకస్మాత్తుగా బదిలే చేసి, సాధారణ హోదా కలిగిన బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఎల్వీ మాత్రం, ఆ పదవి తీసుకోకుండా, వచ్చే నెల 6 వరకు లాంగ్ లీవ్ పెడుతూ, సెలవు పై వెళ్ళిపోయారు. ఆయన తరువాత ఢిల్లీలో ప్రత్యక్షం అవ్వటంతో, ఏమి జరుగుతుందా అని చర్చకు దారి తీసింది. ఆయన బదిలీ తీరు పై, ప్రతిపక్షాలు కూడా, ఆయనకు మద్దతుగా నిలిచాయిమరో చర్చ ఏమిటి అంటే, రాష్ట్రంలో జరుగుతున్న జగన్ పాలన, లోటుపాట్ల గురించి ఒక నివేదికను ఎల్వీ తయారు చేసారని, ఆ నివేదికను కూడా ప్రధానికి ఇస్తారనే చర్చ, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎల్వీ ఢిల్లీ వెళ్ళటం వెనుక, బీజేపీ కూడా ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, తతంగం మొత్తం నడుపుతున్నారని తెలుస్తుంది. ఒక చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం అంటే, ఒక పెద్ద సంచలనం అని, ప్రధాని కూడా ఈ విషయం పై అరా తియ్యటంతో, ఆయనకే నేరుగా విషయం చెప్పే విధంగా, ఎల్వీని ప్రధానితో భేటీ అయ్యేలా చేస్తున్నారని సమాచారం. బీజేపీ ఈ వ్యవహారంలో, రాజకీయ మలుపు తిప్పి, రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే పనిలో భాగంగానే, ఎల్వీ ఢిల్లీ ట్రిప్ అనే ప్రచారం జరుగుతుంది. 15న ప్రధానితో భేటీ అయిన తరువాత కాని, అసలు విషయం తెలిసే అవకాసం లేదు.