YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీమాత్రే నమః

Highlights

  • శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
  • ధర్మో రక్షతి రక్షితః
  •  లోకాస్సమస్తా సుఖినోభవంతు
శ్రీమాత్రే నమః

ఉగాది అనగానే మనకు గుర్తుకువచ్చేది నింబకుసుమ భక్షణం అనగా వేపపువ్వును స్వీకరించడం. దీన్ని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో ఒక భాగంగా తీసుకోవడం మన సాంప్రదాయం. మన పెద్దలు ఆరు రుచులను ‘మధురామ్ల లవణ తిక్తకటు కషాయః’ అని వర్ణించారు. ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ఆరోగ్యపు విలువ ఉంది. అందువల్ల సంవత్సరారంభములో ఈ ఆరు రుచుల సమ్మేళనాన్ని ఒక లేహ్యముగా తయారుచేసి, దేవునికి నివేదన చేసి, దానిని ప్రసాదముగా స్వీకరిస్తాము.

ఇందులో మధురం (బెల్లం), ఆమ్లం (మామిడికాయ), లవణం (ఉప్పు), తిక్తం (వేపపువ్వు), కటు (పచ్చిమిర్చి), కాషాయం (మిరియం) లను వాడతాము. రుచికొరకు కొందరు అరటిపండ్లు, చెరకు ముక్కలు, గుల్లశనగ పప్పు తదితరాలను కూడా కలుపుతారు. జీవితమంటే అన్ని రకాల అనుభవాలు, అనుభూతులు ఉంటాయనే సత్యాన్ని బోధిస్తూనే, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఉగాది పచ్చడి.

కొత్త సంవత్సరంలో అనుభవించబోయే శీతోష్ణ సుఖదుఃఖాలకు, లాభనష్టాలకు, నిందాస్తుతులకు ఈ పచ్చడిని సంకేతంగా వర్ణిస్తారు. వీటిని జీవితంలో సమదృష్టితో చూడాలని గీతాచార్యుడు చెప్పాడు కూడా. అంతేగాక ఆయా ఋతువులలో వచ్చే వేడి, ఉష్ణం, శీతలం, చలి వంటి అనుభవాలను ఉగాది పచ్చడి రూపంలో స్వీకరించి చూడమని చెప్తోంది. ఈ ఉగాది పచ్చడిలో ఔషధగుణాల వలన దీనిని స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు శాంతిస్తాయి. “సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణమ్” అని పెద్దలు అంటారు. అంటే వేపపువ్వును స్వీకరించడం వలన అన్ని అరిష్టాలు నశిస్తాయి. ఈ ఉగాది పచ్చడిని కేవలం ఆ ఒక్కరోజునే కాక కనీసం 15 రోజులపాటు స్వీకరిస్తే దానిలోని ఔషధగుణం మనిషి దేహాన్ని వజ్రసమానంగా చేస్తుందని నమ్మకం.

 “అబ్దాది నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ |
భక్షితమ్ పూర్వమాయేతు తద్వార్హం సౌఖ్యదాయకమ్” ||

పై శ్లోకములో చెప్పినట్లుగా కొందరు ఉగాది పచ్చడిలో ఘృత...చెప్పినట్లుగా కొందరు ఉగాది పచ్చడిలో ఘృతాన్ని (నేతిని) కూడా వేస్తారు. “ఈ నేతిబొట్టు లాగే సంసారయాత్రను నిర్వహిస్తున్నాను దానిలో ఎదురయ్యే సమస్యలకు అతీతుడనై నిర్లిప్తముగా మనస్సును ఉంచుకొంటాను ” అని భావం. ఎందుకంటే ఉగాది పచ్చడిలో వేసిన నేతిబొట్టు పచ్చడిలోనే ఉన్నప్పటికీ ఏ రుచితోనూ కలవక మొత్తముగా పచ్చడికే గొప్ప రుచిని తీసుకువస్తుంది.
 ‘బ్రహ్మకల్పం’ 
బ్రహ్మ సృష్టిలో ప్రళయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని ‘బ్రహ్మకల్పం’ అని అంటూ ఈ ప్రారంభకాలాన్ని ‘కల్పాది’ అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే ‘ఆది’ సమయమే ‘ఉగాది’ పండుగ. దీన్ని గురించి ‘సూర్య సిద్ధాంతం’ అనే జ్యోతిష గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సర ఆరంభ దినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకొనే ఆచారం ఏర్పడింది. ‘యుగాది’ అన్న సంస్కృత పదం ఉచ్చారణాభేదం వల్ల ‘ఉగాది’ అనే తెలుగు మాటగా ఏర్పడింది.
 
సృష్టి ప్రభవం అయిన ఈ మొదటి సంపత్సరం నుండి చరితార్థంగా ‘ప్రభవ’ అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ‘క్షయ’ నామ సంవత్సరం క్రమంలో 60 నామాలతో సంవత్సర గమనం సాగుతుంది. కనుకనే మనం జన్మించిన మొదలు ఈ నామ చక్రం మనకు 60 సంవత్సరాల వయస్సుకు చేరినపుడు తిరిగి అదే సంవత్సరంతో పూర్తి అవుతుంది. అప్పుడు షష్టిపూర్తి జరుపుకొంటాం.
 
వేదాలను హరించిన సోమకుడు అనే రాక్షసుని వధించి శ్రీ మహావిష్ణువు తిరిగి పునరుద్ధరించిన రోజుగా కూడా ఉగాది ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు బుతువులుగా విభజితం అయింది. సంవత్సరం పొడవునా అనేక ఒడుదొడుకులు అనుభవించిన ప్రకృతిలోని చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి. చైత్రమాసంలో క్రొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్రమాసం. అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చినదని కూడా చెప్పుకోవచ్చు.
 
ఉగాది పర్వదినాన ‘అభ్యంగనం, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమ వర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరాలతో కూడిన పంచాగ శ్రవణం’ అనే ముఖ్యమైను విధులను అనుసరించాలని పెద్దల మాట!
 
అభ్యంగనం
సూర్యోదయానికి పూర్వమే నువ్వులనూనె తలకి పట్టించి ఉసరిక, పెసరపిండి, మ్రానిపసుపు, భావంచాలు, కచ్ఛూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం కుంకుళ్ళతో చేయాలి. ఈ దినం వేడినీటి స్నానం శ్రేష్ఠం. అనంతరం తిలకం దిద్దుకుని, నూతన వస్త్రాలు ధరించి సంకల్పం చెప్పుకోవాలని ‘ధర్మసింధువు’ తెలియచేస్తోంది.

పుణ్యకాల సంకల్పం
సూర్యోదయానికి ఒక ముహూర్తకాలం (20 నిమిషాలు) మాత్రమే పాడ్యమి ఉన్నా సరే ఆ రోజునే పండుగ సందర్భ నూతన సంకల్పం చెప్పుకొని ప్రారంభించాలి. సూర్యునికి అర్ఘ్యం, దీపం, ధూపం, పుష్పాంజలి సమర్పించాలని శాస్త్ర వచనం.
 
ధర్మకుంభం
ఉగాది రోజు రానున్న రోజులలో పూర్ణ మనోరథసిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయనే సంకల్ప బలంతో పంచలోహాల పాత్రగాని, మట్టి కుండగాని కలశంగా తీసుకుని సుగంధ జలం, చందనం, పుష్పాక్షతలు వేసి ఆవాహన చేసి, పుణ్యాహ మంత్రాలతో బియ్యం పోసిన ఒక పళ్ళెంలో కలశం ఉంచి నూతన వస్త్రం చుట్టి ఉపరిభాగాన నారికేళం పెట్టాలి. కుంకుమ, పసుపు చందనాలు సమర్పించి పురోహితునకు గానీ, గురువునకు గానీ, లేక గుడిలోని ఇష్ట దైవానికి గానీ దానమిచ్చి వారి ఆశీర్వాదం పొందాలి. దీనినే ‘ధర్మఘట దానం’ లేక ‘ప్రపాదానం’ అంటారు. ఈ విధి నేటికీ పల్లెలలో ఆచరిస్తున్నారు.

పంచాంగ శ్రవణం
మహాపర్వదినములైన కల్పాది తిధులు, మన్వంతర తిధులు, దశావతార పుణ్యతిథులు మొదలైన వాటిని పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదు అంగాల కలయికగా చూపిస్తారు. ఈ విధమైన పంచ అంగాల శ్రవణం వల్ల భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్ష వివరాలు, కాల నిర్ణయాలు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఉగాది రోజున విశేష విధిగా భావించాలి. కనుక హైందవ సాంప్రదాయములో పంచాంగ శ్రవణం ఉగాది తిథి రోజున ప్రాముఖ్యత సంతరించుకుంది.
 
తిథేశ్చ, శ్రియమాప్నోతి వారాధాయుష్య వర్ధనమ్‌
నక్షత్రాత్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్‌
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫలముత్తమమ్‌
కాల విత్కర్మ కృద్ధీమాన్‌ దేవతానుగ్రహం భవేత్‌ !!
 
తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్యు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణము వల్ల కార్యానుకూలత సిద్ధిస్తాయి. కాలం తెలిసి కర్మం చేసే ఆస్తికులు భగవత్‌ అనుగ్రహం పొంది సుఖం అనుభవిస్తారు. రామాయణాది పవిత్ర గ్రంథ పఠనం వల్ల వచ్చే విశేష ఫలం ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా పొందవచ్చు.
 
భూమి, స్వర్ణం, ఏనుగులు, గోవులు, సర్వ లక్షణయుక్తమైన కన్యను ఉత్తముడైన పాత్రునకు దానం చేస్తే కలిగినంత ఫలితంతో సమానం. శాస్త్రవిధిగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల సూర్యుని ద్వారా శౌర్య తేజస్సులు, చంద్రుని ద్వారా భాగ్య వైభవాలు, కుజుని ద్వారా సర్వ మంగళాలు, బుధుని ద్వారా బుద్ది వికాసము, గురుని ద్వారా గురుత్వం, ఙ్ఞానం, శుక్రుని ద్వారా సుఖం, శని దేవుని ద్వారా దుఃఖ రాహిత్యం, రాహువు ద్వారా ప్రాబల్యము, కేతువు ద్వారా తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతాయని శాస్త్ర వచనం.
 
ఉగాది నాడు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఉగాది పచ్చడి స్వీకరణ. దీనిని పరగడుపునే స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
 
తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు రుచులు కలసిన ఉగాది పచ్చడి మన సొంతం. ప్రతీ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనుభవాలకు ప్రతీకగా దీన్ని భావిస్తారు. ఈ పచ్చడి తయారు చేయడానికి చెరకు, మామిడికాయలు, వేప పువ్వు, అరటి పళ్ళు, లవణం, చింతపండు, బెల్లం, పచ్చి మిరప మొదలైనవి వాడతారు. మామిడి పూత, అశోక చిగురులు కలిపి సేవించే సంప్రదాయం మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.

 జై శ్రీమన్నారాయణ 
 

                                                                                      -- మీ కూనపులి సుబ్రమణ్య శర్మ 

Related Posts