ఇసుక దీక్షకు పవన్ మద్దతు
విజయవాడ, నవంబర్ 13,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేతలు కలిశారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు.. ఆయనతో సమావేశమయ్యారు. ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దీక్షకు మద్దతు కోరారు. అలాగే ఇసుక కొరత, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా రాజకీయ పరిణామాలపై పవన్‌తో టీడీపీ నేతలు చర్చించారు.దీక్షకు మద్దతుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారన్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. సమస్యను పరిష్కరించాలని అడిగితే ఎదురు దాడి చేయడం దారుణమన్నారు. 40మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని.. ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు వర్ల రామయ్య.జనసేన పార్టీ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల్ని నిరసిస్తూ.. ఈ నెల 9న విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించింది. ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఫోన్ చేసి కోరారు. టీడీపీ కూడా సానుకూలంగా స్పందించింది.. టీడీపీ తరపున మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడిని పంపారు. ఇద్దరు నేతలు లాంగ్‌మార్చ్ తర్వాత జరిగిన సభలో పాల్గొన్నారు.తాజాగా తమ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలు జనసేన అధినేతను కలిశారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు జనసేన చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి చంద్రబాబు దీక్షకు మద్దతుపై జనసేన ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.