YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆశాల రబీ.. (కృష్ణాజిల్లా)

ఆశాల రబీ.. (కృష్ణాజిల్లా)

ఆశాల రబీ.. (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, : జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. పొలాల్లో పంటలు ప్రస్తుతం కోత దశకు చేరుకున్నాయి. దాళ్వా సాగుపై ఆశలు పెంచాయి. మరి రబీకి నీళ్లిస్తారా? లేదా? అన్న ఆలోచనలో సాగుదారులున్నారు. అధికారులవైపు ఆశగా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లోని 3.17లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. వరి మాత్రమే 2.36 లక్షల్లో వేశారు. ప్రారంభంలో కొంత ఇబ్బందులు పడ్డా తరువాత వర్షాలు పడటం, కాలువల్లో నీళ్లు రావడంతో లక్ష్యం మేర సాగయ్యింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పెడన, బందరు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, కలిదిండి, గుడివాడ, చాట్రాయి, బాపులపాడు తదితర ప్రాంతాల్లో కొంత మేర పంట దెబ్బతింది. నిబంధనలకు అనుగుణంగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ధర ఎక్కువగా వస్తుంది, ఆపై అపరాలకు కూడా అనువుగా ఉంటుందని జిల్లాలో ఎక్కువశాతం మంది బీపీటీ లాంటి సన్నరకాలు సాగు చేశారు. పెడన, మచిలీపట్నం, గుడివాడ, పామర్రు తదితర నియోజకవర్గాల్లో  ఎక్కువశాతం పొలాలు కోత దశకు చేరుకున్నాయి.
రైతులు కొన్నేళ్లుగా రబీ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, బందరు తదితర మండలాల్లో గతేడాది ఎక్కువశాతం మంది మినుము, పెసలు సాగు చేశారు. విజయవాడ గ్రామీణం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో సాగునీటి లభ్యతున్నవారు, బోరుబావుల కింద దాళ్వా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ముందుగా నాట్లు వేసిన పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యంగా నాట్లు వేసిన అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల తదితర ప్రాంతాల్లోని పొలాలు పాలు పాసుకుని గింజకట్టే దశలో ఉన్నాయి. అన్నదాతలు దాళ్వా ఉంటుందా.. లేక అపరాలు సాగు చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే చాలామంది అపరాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. కోతలు ప్రారంభించిన తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో దాళ్వా ఉంటుందో లేదో అన్న అనుమానంతో అపరాలు వేస్తున్నారు. జిల్లాలో కొంతమంది దాళ్వా కావాలంటుంటే మరికొందరు అపరాలే వేసుకుంటామని చెబుతున్నారు. పెడన నియోజకవర్గంలో కృత్తివెన్ను మండలంతోపాటు బందరు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో భూములు అపరాల పంట పండదు. అందుకే ఈసారి దాళ్వా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. వ్యవసాయశాఖ అవసరమైన ప్రాంతాలకు మినుములు అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని వరి కోతలు ప్రారంభించిన ప్రాంతాలతోపాటు సిద్ధంగా ఉన్న మండలాలకు 3,200 క్వింటాళ్ల మినుములు, 300 క్వింటాళ్ల పెసలు రాయితీపై ఆయా ప్రాంతాలకు పంపిణీ చేసింది. రైతుల అవసరాన్ని బట్టి మరిన్ని విత్తనాలు పంపిణీ చేయడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టడంతో దాళ్వా ఉండదేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండు పంటలకు నీరు ఇస్తామని ఇంతకుముందు నాయకులు చేసిన ప్రకటనలు దృష్టిలో పెట్టుకుని అందుకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు..

Related Posts