చేరేవారేరీ..? (పశ్చిమగోదావరి)
ఏలూరు, : ఇంజనీరింగ్ విద్య గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలు కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరమవుతుండగా మరికొన్ని సీట్లు తగ్గించుకుంటూ ప్రయాస పడుతున్నాయి. 50 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులున్న కళాశాలలను మూసివేయాలంటూ ప్రభుత్వ విద్యా సంస్కరణల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికతో పలు కళాశాలలు ఉలిక్కిపడ్డాయి. వచ్చే విద్యా సంవత్సరంలో పలు కళాశాలల్లో బ్రాంచిల కోతే కాకుండా అవి మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజినీరింగ్ సీటు సంపాదించడమంటే 1996-1998కి ముందు ఎంతో గొప్ప విషయం. కళాశాలలో అప్పట్లో బ్రాంచికి కేవలం 45 సీట్లు ఉండేవి, తర్వాత 60కి చేరింది. సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ, మెకానికల్ తదితర కోర్సుల సీట్లను కొన్ని యాజమాన్యాలు 600 వరకూ పెంచుకున్నాయి. ఐదేళ్లుగా పరిశీలిస్తే కొన్ని కోర్సులకే విద్యార్థులు పరిమితమవుతుండగా.. కొన్ని బ్రాంచిల్లో విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. తరగతులు నిర్వహించాలంటే విద్యాప్రమాణాలు పాటించాల్సి ఉంది. అయితే నష్టాలతో కొనసాగడం కష్టమంటూనే పలు యాజమాన్యాలు తరగతులు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పలు విద్యాసంస్థల్లో 100లోపు మాత్రమే చేరికలుండగా సెక్షన్‌లో 60 మందికి ఒక్కరు ఉంటున్నారు. మరికొన్ని బ్రాంచిలు కనీసం ఎంపిక చేసుకునే వారే లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని కళాశాలల్లో మాత్రమే ఆశాజనకంగా సీట్లు భర్తీకాగా అత్యధిక కళాశాలల్లో అత్యల్పంగా భర్తీ అయ్యాయి. మూడు కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరమయ్యాయి. ప్రాంగణ ఎంపికలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పలు కళాశాలల్లోని 30 శాతం యాజమాన్య కోటాకు సంబంధించిన సీట్లు సైతం భర్తీకి నోచుకోని పరిస్థితులున్నాయి. సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచులు మినహా మిగిలిన వాటిల్లో సీట్లు భర్తీకి నోచుకోలేదు. గతంలో తరగతి గది విద్యార్థులతో నిండుగా కనిపించగా నేడు చాలా వాటిల్లో అది వెలవెలబోతోంది. కన్వీనర్ కోటాలో మెచ్చిన సీటు దక్కని వారు యాజమాన్య కోటాలో తప్పకుండా సీటు కొనుగోలు చేసుకుంటారని ఎదురు చూసిన యాజమాన్యాలకు నిరాశ తప్పలేదు.
పలు కళాశాలల్లోని సీట్లను భర్తీ చేసుకునేందుకు ఆయా యాజమాన్యాలు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల చిరునామా సేకరించి చరవాణి నంబరులో సంప్రదించినా భర్తీపై ప్రభావం కనిపించడం లేదు. ల్యాప్‌టాప్ ఇచ్ఛి. బస్సు ప్రయాణ సౌకర్యం ఉచితమన్నా చేరికలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. విద్యాసంస్థల పేరు చెప్పి, గతంలోని విద్యార్థులు సాధించిన విజయాలు చెప్పుకొచ్చినా వినేవారుండటం లేదు. పలు కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు కానరాకపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో కౌన్సెలింగ్ సమయంలోనే విద్యార్థులు తిరస్కరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చేరినా తదనంతరం నిర్వహించే కౌన్సెలింగ్‌లో జారుకుంటున్నారు. సాంకేతిక విద్య నిర్వహణ విషయంలో ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంది. ఇటీవల పలు కళాశాలల్లో ఒకట్రెండు కోర్సుల్లో మాత్రమే విద్యార్థులుంటుండగా కొన్ని బ్రాంచుల్లో చేరికలే ఉండటం లేదు. అయిదేళ్ల కాలంలో బ్రాంచీల వారీగా ఎందరు చేరారో, ఖాళీగా ఉన్న బ్రాంచుల వివరాలను వచ్చే విద్యాసంవత్సరానికి ముందుగానే ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి కౌన్సెలింగ్‌కు వెళ్లే సమయంలోనే పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉండటంతో పలు యాజమాన్యాలు కౌన్సెలింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.