ఆర్టీసీపై నో హైపవర్ కమిటీ
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్
హైద్రాబాద్, నవంబర్ 13,
ఆర్టీసీ సమస్యపై ఉన్నత స్థాయి కమిటీ నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం (నవంబర్ 13) అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని.. ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం తెలపాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ఏజీ దీనిపై అభిప్రాయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ అంశం లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందున ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ అవసరం లేదని.. చట్టప్రకారం లేబర్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.ఆర్టీసీ అంశంపై హైకోర్టులో వరసగా మూడో రోజు విచారణ కొనసాగుతోంది. హై పవర్ కమిటీ విషయంతో తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయం తెలిసిన వేళ.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏజీ చెప్పారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ వ్యవహారంపై చర్చల సమయం ముగిసిందని.. ఇక చట్ట పరిధిలోనే విచారించి తేలుస్తామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి రాదని చెప్పింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడానికి కోర్టు వేదిక కాదని పేర్కొంది. చర్చల విషయంలో ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలు.. ఎవరూ తగ్గలేదని, చర్చలు జరపాలంటూ కోర్టు ఎవరినీ ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. వైఫల్యాలపై ఎండగడతాం తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నరే అపాయింట్‌మెంట్ ఇచ్చినపుడు సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి కనీస ధ్యాస లేదన్నారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు.మరి కేసీఆర్‌కు ఏమైంది? ఆయన మొండివైఖరే సమ్మెకు కారణం. ఇంత దీర్ఘకాలికంగా సమ్మె ఎప్పుడూ జరగలేదు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు. ముఖ్యమంత్రి కార్మికులను చర్చలకు పిలవాలి. త్వరలో అన్ని సంఘాల నాయకులు సమ్మెబాట పట్టే రోజులు వచ్చాయి. మరోవైపు భూ ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ ధరణి వెబ్‌సైటే పనిచేయడం లేదు. అన్నీ బోగస్ లెక్కలుగా తేలిపోయాయి. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రం రూ.3,12,000 కోట్ల అప్పుల తెలంగాణ అయింది. త్వరలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా’ మని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.