పన్నుల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు
హైదరాబాద్ నవంబర్ 13
వివిధ శాఖల ద్వారా వసూలు చేయవలసిన పన్నులు, ఇతర రుసుములను రికవరీ చేయడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ టి. హరీష్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషితో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అంశం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 11 శాఖలకు సంబంధించి రూ. ఒక వేయి 966 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వివిధ రకాల రుసుములు, పన్నులు ద్వారా రికవరీ కావలసి ఉన్నదని తెలిపారు. రెవిన్యూ, వ్యవసాయ కో-ఆపరేటివ్ మార్కెటింగ్, మైన్స్ అండ్ జియాలజీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్, కమర్షియల్ టాక్సెస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ మొత్తాలు రావలసి ఉన్నదని, ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నాలా వసూలు సుమారు 840 కోట్లు రావలసి ఉన్నదని తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి రాష్ట్రంలో 14 వేల కేసులు ఉన్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం, ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగడంతో పాటు ప్రజలకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. ఈ దిశగా కలెక్టర్లు ఆయా శాఖల ఆధ్వర్యంలో రావాల్సి ఉన్న రుసుములు, పన్నులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పెండింగ్ టాక్స్ ల వసూలుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా కొన్ని శాఖల ఆధ్వర్యంలో పలు పథకాలకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, పథకాలు ముగిసిన తర్వాత కూడా కొంత మొత్తం ఆ ఖాతాల్లో మిగిలిపోయి నిరుపయోగంగా ఉన్ననందున అట్టి వివరాలను సేకరించి నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.