మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు
మెదక్,
ఆర్టీసీ సమ్మెను ఆయుధంగా చేసుకుని ప్రజాక్షేత్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులతో మొదలైన అలజడి అన్ని వర్గాలనూ ఆలోచింప చేసిందని.. దీన్ని ఆసరాగా చేసుకుని పూర్వ వైభవం దిశగా ముందుకు సాగాలని ‘హస్తం’ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. బీజేపీ సైతం పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని బలం పెంచుకునే దిశగా అడుగులేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ఉన్న ఆయా పార్టీల జిల్లా నాయకులు.. ఆర్టీసీ సమ్మెను ఆయుధంగా మలుచుకుని లక్ష్యం చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో పోటాపోటీగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మార్చి తర్వాత ‘గులాబీ’ దళం మినహా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో స్తబ్ధత కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టగా.. పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సమ్మె మొదలైన రెండు, మూడు రోజుల వరకు జిల్లాలోని విపక్ష పార్టీల నేతలు సైతం కొంత మౌనంగానే ఉన్నారు.రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్, బీజేపీతోపాటు వామపక్ష నేతలు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. ప్రధానంగా బీజేపీ ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ప్రత్యక్షంగా కార్మికుల ఆందోళనలో పాలుపంచుకుంటోంది. కాంగ్రెస్ సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ పార్టీ స్థానిక నేతలు కేవలం సంఘీభావాలకే పరిమితమయ్యారు. ఏదేమైనా ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయుధంగా ఉపయోగించుకుంటూ బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనే సంకల్పంతో ఉంది. ఆ దిశగా ఆ పార్టీ జాతీయ నేతలు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉంటూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బేరీజు వేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలపడంతోపాటు స్వయంగా పాల్గొని ప్రజాక్షేత్రంలో బలం పెంచుకోవాలని జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు రాష్ట్ర నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారుఆ పార్టీ జిల్లా నేతలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ దూసుకెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్ రావు మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, వల్లాల విజయ, గుండు మల్లేశం, నందారెడ్డి తదితరులు ప్రతిరోజు ఏదో ఒక చోట ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో ‘కమలం’ శ్రేణులు ర్యాలీలలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఎన్నికల్లో ఘోర పరాజయంతో చతికిలబడి స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నేతలు మెల్లమెల్లగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతుప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ రాష్ట్రస్థాయి నేతలు జిల్లా వైపు చూడని పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్ జిల్లా నాయకత్వం ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి.. ఓ రోజు వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ నేతలు మ్యేడం బాలకృష్ణ, బట్టి జగపతి తదితరులు పాల్గొన్నారు.అయితే ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు జిల్లాలో లేవు. ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి చెందిన నాయకులు.. శ్రేణులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం చేపట్టిన బంద్ సందర్భంగా ‘హస్తం’ నేతలు అఖిలపక్షంతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు సైతం భాగస్వాములు కావడంతోపాటు పలు మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించారు.