హూజూర్ నగర్ మొహం చాటేసిన ఉత్తమ్
నల్లగొండ,
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1999 నుంచి వరసగా గెలుస్తూ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో సయితం హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు 2018 ఎన్నికల్లో ఓడిపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలిచారు. రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో కీలక పదవి చేపట్టాలనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.ఇలా వరస గెలుపులతో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల హుజూర్ నగర్ లో తన భార్యను గెలిపించుకోలేక పోవడం అవమానకరంగా భావిస్తున్నారు. రాజకీయ నేతకు ఓటమి సహజం. జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతలు తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓడిపోయినా ఫలితాలు వెలువడిన వెంటనే నియోజకవర్గాల్లో పర్యటించి క్యాడర్ కు ధైర్యం చెప్పారు. కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హుజూర్ నగర్ కు ఇంతవరకూ రాలేదు.సహజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటారన్న ప్రచారం ఉంది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు అరవై వేల ఓట్లు వచ్చాయి. మరి ఆ ఓట్లను, క్యాడర్ ను నిలుపుకునేందుకైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో పర్యటించాలని ఆ ప్రాంత నేతలు కోరుతున్నారు. హుజూర్ నగర్ లో హ్యాట్రిక్ విజయాలను సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన కేంద్ర స్థాయిలో పార్టీ పదవులను తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో ఏదో ఒక పదవి సంపాదించి ఢిల్లీలో సెటిల్ అవ్వాలన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఓటమిని స్వీకరించే రాజకీయం ఇంకా అలవాటు కాలేదన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.