ఇంటర్ కాలేజీలను చుట్టు ముడుతున్న సమస్యలు
నల్లగొండ,
ర్కారు కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్యతో పాటు సమస్యలూ పెరిగిపోతున్నాయి. నిధుల్లేక ఏండ్ల నుండి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర సర్కారేమో ఆయా పనులకు నిధులు మంజూరు చేయడంలేదు. దీంతో ఆ నిధులను వేరే రూట్ల ద్వారా సేకరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, కలెక్టర్ల స్పెషల్ ఫండ్స్ కోసం లేఖలు రాసింది. ఈ రకంగానైనా సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తోంది.రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో సుమారు 2 లక్షల మంది చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సర్కారు కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే ఇంటర్ బోర్డుకు ఒమర్ జలీల్‌ను సెక్రటరీగా నియమించింది. ఈ క్రమంలో సమస్యలెలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆయన వివరాలు సేకరించారు. ఏ కాలేజీల్లో ఏఏ సమస్యలున్నాయనే లెక్కలను ప్రిన్సిపాల్స్ ద్వారా తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం భారీగానే సమస్యలున్నట్టు గుర్తించారు. మొత్తం 404 కాలేజీల్లో 394 కాలేజీలు స్వంత భవనాలుండగా, వీటిలో ఆరు నిర్మాణంలో ఉన్నాయి. మరో పది కాలేజీలు స్కూల్ భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పక్కా భవనాల్లో నడుస్తున్న కాలేజీలు శిథిలావస్థకూ చేరాయి. ప్రిన్సిపాల్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం కొత్తగా18 కాలేజీ బిల్డింగ్స్ అవసరమని తేల్చారు. మరో 95 కాలేజీల్లో అడిషనల్ రూమ్స్ అవసరమని గుర్తించారు. మరో199 కాలేజీలకు రిపేర్లు కావాలని తేలింది. వీటితో పాటు129 కాలేజీల్లో టాయ్‌లెట్స్, 149 కాలేజీలకు కాంపౌండ్ వాల్స్ అవసరమని గుర్తించారు. సుమారు వందకు పైగా కాలేజీల్లో ఇతర చిన్న చిన్న సౌకర్యాలు అవసరమని తేలింది.సర్కారీ జూనియర్ కాలేజీల్లోని సమస్యల పరిష్కారానికి రూ.350.54 కోట్లు అవసరమని అధికారులు లెక్కలేశారు. ఇన్ని నిధులను ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఇంటర్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఎక్కువగా ఉన్న కాలేజీల వివరాలను సేకరించారు. వాటిల్లోని స్టూడెంట్స్‌ను చూపిస్తూ ఆ కాలేజీల్లో మౌలిక వసతుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో పాటు మైనారిటీ శాఖ నుంచి నిధులను అడుగుతున్నారు. రాష్ట్రంలో18 కాలేజీల్లో 13,122 మంది స్టూడెంట్స్ చదువుతుండగా, 3,398 మంది ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ కాలేజీల్లో వసతుల కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ.31.5 కోట్లు కావాలని కోరారు. అలాగే మరో 26 కాలేజీల్లో 8,144 మంది చదువుతుండగా, వాటిలో 4,422 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. ఆ కాలేజీల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ.18.9 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ లేఖ రాశారు. మరో 27 కాలేజీల్లో మైనార్టీ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండగా, వాటిలో వసతుల కోసం రూ.103 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మైనారిటీ శాఖ నిధులను కేంద్రం 60 శాతం ఇస్తే, రాష్ట్రం 40 శాతం ఇవ్వాల్సి ఉంది. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం లేఖ రాశారు. మరోపక్క కలెక్టర్లకూ లేఖలు రాశారు. ఈ నిధులు వస్తే, సర్కార్ జూనియర్ కాలేజీలు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.