యార్లగడ్డకు ఇంటిపోరు...
విశాఖపట్టణం, నవంబర్ 14,
పెద్దాయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కి చాలా కాలానికి పదవి దక్కింది. ఇంకా సీట్లో కుదురుగా కూర్చున్నారో లేదో కానీ ఆయన్ని దిగిపోమంటున్నారు. బూర్లగంపలో పడ్డాననుకుంటే ఒక్క బూరె అయిన తినకుండానే బయటకు లాగేస్తే ఎలా. ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిమానుల బాధగా ఉందిట యార్లగడ్డ విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగం అధ్యాపకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆయన అన్న నందమూరికి హిందీ నేర్పే మాస్టార్ గా పరిచయమై అదే టీడీపీలో ఆయనకు ఆత్మబంధువు అయిపోయారు. అన్న కుమారుడు హరికృష్ణతో బాగా సాన్నిహిత్యం నెరిపిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్1996లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. హరికృష్ణ ఈ విషయంలో బాబుతో చేసిన పోరాటం అప్పట్లో పెద్ద సంచలనం. ఇక తరువాత కాలంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బీజేపీతోనూ బాగానే సంబంధాలు కొనసాగించారు. ఏపీకి వచ్చేసరికి చంద్రబాబుతో ఆయనకు పడేది కాదు, వైఎస్సార్ పాలనలో కొంత గుర్తింపు లభించినా కాంగ్రెస్ పొడ గిట్టని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పెద్దగా వెలుగులోకి రాలేకపోయార.ఇక ఇపుడు వైఎస్సార్ కుమారుడు జగన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను చేరదీసి అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఓ విధంగా పెద్దాయనకు అది గొప్ప గౌరవం. ఈ ముచ్చట ఇలా తీరకుండానే ప్రాధమిక విద్యలో ఆంగ్ల భాషను ప్రవేశపెడుతూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది. అందరూ జగన్ కంటే కూడా ఎక్కువగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా అయితే చీల్చిచెండాడుతోంది. మరో వైపు భాషాభిమానులు కూడా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు భాషాకు ద్రోహం చేశారని కూడా నిందిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక, పూర్తిగా సమర్ధించలేక పెద్దాయన కకావికలం అవుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష చచ్చిపోతోందని గొంతెత్తి అరచింది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నే. చంద్రబాబు పాలనలో ఆయన ప్రతీ రోజూ ఇదే అంశం మీద విమర్శలు చేసేవారు. అమరావతి రాజధాని శిలాఫలకం మీద తెలుగు అక్షరాలు లేవంటూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బాబుని ఘాటుగా తగులుకున్నారు.పదవీ, పెదవీ….ఇపుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గతకాలపు ప్రకటనలే భాషావేత్తలు, అభిమానులకు ఆయుధాలు అవుతున్నాయి. వాటికి సమాధానం చెప్పమంటూ నిలదీస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పరిస్థితి తయారైంది. నిజానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సర్దిచెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం కావడంతో పెదవి విప్పలేకపోతున్నారు. తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఉంటుందని, తెలుగు వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేస్తున్న ఊరడింపు ప్రకటనలు మరింత ఆగ్రహం కలుగచేస్తున్నాయి.తాను తెలుగులో జీవోలు తెప్పించేలా చూస్తానని, తెలుగులోనే పాలన సాగేలా చర్యలు తీసుకుంటామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని అంటున్నారు. ఒకటి నుంచి పది వరకూ తెలుగు కచ్చితంగా మాధ్యమంగా ఉండాలని భాషావేత్తలు డిమాండ్ చేస్తూంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తప్పుతోవ పట్టిస్తున్నరని అంటున్నారు. అయితే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పెదవి విప్పి స్పందిస్తే పదవికే చేటు వస్తుందని అంటున్నారు. జగన్ ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఆయన ఎవరి మాట వినరు, అందువల్ల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిందలు మొస్తూ పదవిలో ఉండడమో, లేక పదవిని వదులుకోవడమో చేయాలని అంటున్నారు. మొత్తానికి తన పదవికి ఇంత పవరా అన్న సంగతి పెద్దాయనకు నెల రోజుల్లోనే తెలిసిందని సెటైర్లు పడుతున్నాయి.