తమ్ముళ్లకు బిస్కెట్లు
తిరుపతి, నవంబర్ 14,
నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు ఆయనే దిగజార్చుకునే విధంగా ఉన్నాయి. తనతో జూనియర్ నేతలను కూడా ఆయన పోల్చుకోవడం పై టీడీపీలోనే చర్చ జరుగుతోంది. నిజానికి చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నారు. సంక్షోభాలను సయితం తనకు అవకాశంగా మలచుకోగలరన్న నమ్మకాన్ని క్యాడర్ లో చంద్రబాబు కల్గించారు.అయితే తాజా జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో చంద్రబాబు మానసికంగా కుంగిపోయారన్నది ఆయన వ్యాఖ్యలను బట్టే వెల్లడవుతోంది. నిజానికి చంద్రబాబుకు రాజకీయాల్లో ఎవరూ పెద్దగా సమకాలీనులు లేరు. 1980వ దశకం నుంచే చంద్రబాబు రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎన్టీఆర్ అధికారంలో ఉండగా ఆయన మంత్రిగా ఉన్నా జాతీయ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకునే నేతగా పేరుగడించారు. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, దేవెగౌడ వంటి నేతలతో రాజకీయాలు చేసిన నేత చంద్రబాబు.వారితో తనను పోల్చుకుంటే జనం మెచ్చుకుంటారు. కార్యకర్తలు సయితం సంతోషపడతారు. కానీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. రాష్ట్రంపైనే ఎక్కవగా దృష్టి సారించారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ తో తనను పోల్చుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం తనను, పవన్ కల్యాణ‌్ లను వేధిస్తుందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. విశాఖ లాంగ్ మార్చ్ లో మద్దతు ప్రకటించిన చంద్రబాబు పవన్ కు దగ్గరయ్యే ప్రయత్నంలోనే ఈ కామెంట్స్ చేస్తున్నారనుకోవచ్చు.తాజాగా చిత్తూరు జిల్లాలలో పర్యటించినప్పుడు కూడా చంద్రబాబు నోటి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు విన్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ జిల్లా నుంచే తాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశామని, ఎప్పుడూ జగన్ లాగా వ్యవహరించలేదని సమావేశంలో చెప్పుకొచ్చారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తండ్రితోనే రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ విషయాన్ని మర్చి తన స్థాయిని తానే దిగజార్చుకునే రీతలో వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ పార్టీలోనే విన్పిస్తున్నాయి. అయితే జగన్ కు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేయడంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు.