ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
వనపర్తి నవంబర్ 14
వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం, వనపర్తి, చినగుంటపల్లి, సోళీపూర్, ఖిల్లా ఘణపురం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతు రెక్కల కష్టం దళారుల పాలు కావద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. పండిన ప్రతి గింజను మద్దతుధరకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నాం. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. రబీలోనూ వరి విస్తీర్ణం గతంలోకన్నా ఎక్కువ సాగు అవుతుంది. రైతుకు మద్దతుధర దక్కేందుకు అధికారులు సహకరించాలని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అకాలవర్షానికి పాడుకాకుంటా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు తేమ శాతంతో ధాన్యం ఉండేలా రైతులు సహకరించాలి.. ఎండలు మంచిగా ఉన్నందున అవసరమైతే తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు నిర్దేశించిన గోదాంలకు తరలించాలి. తూకాలలో ఎలాంటి అక్రమాలకు తావివ్వరాదు. వ్యవసాయం చేసిన రైతు సంతోషంగా బతుకేందుకు అందరం సహకరిద్దామని అన్నారు. ఈకార్యక్రమానికి కలెక్టర్ శ్వేతామొహంతి, , జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు హజరయ్యారు.