YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్వరలో 8 రైతుబజార్ల సాకారం

త్వరలో 8 రైతుబజార్ల సాకారం

జిల్లాలో కొత్తగా ఎనిమిది రైతుబజార్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నామని, ఇవి రెండు నెలల్లోనే అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు విశ్వనాథరెడ్డి తెలిపారు. గురువారం ఆయన చిత్తూరు రైతుబజారును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పన.. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రైతుబజారును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, మదనపల్లెల్లో రైతుబజార్లు ఉన్నాయి. మిగిలిన 11 నియోజకవర్గ కేంద్రాల్లో వీటి నిర్మాణానికి మార్కెటింగ్‌ శాఖ స్థలాలను ఎంపిక చేసి నివేదించింది. చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రస్తుతం సంతలు జరుగుతున్న చోటే రైతుబజార్లను ప్రారంభించనున్నాం. పుంగనూరులో అనుకూలమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమవుతోంది. మిగిలిన ఎనిమిది నియోజకవర్గ కేంద్రాలైన పూతలపట్టు, పలమనేరు, కుప్పం, గంగాధరనెల్లూరు, నగరి, సత్యవేడు, పీలేరు, తంబళ్లపల్లెలల్లో రైతుబజార్ల ఏర్పాటుకు గుర్తించిన స్థలాలను పరిశీలించాం. రైతులు, వినియోగదారులకు సౌకర్యార్థం, మౌలిక వసతులతో ఆధునాతన పద్ధతిలో వీటిని నిర్మించనున్నాం. ఒక్కో రైతుబజారుకు రూ.45లక్షల చొప్పున ఎనిమిదింటికి కలిపి రూ.3.60 కోట్ల వ్యయ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వారం రోజుల్లో నిధులు మంజూరు కానున్నాయి. తక్షణమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామ’ని విశ్వనాథరెడ్డి వివరించారు. మార్చి నెలాఖరుకల్లా వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

చిత్తూరులో వేగంగా పనులు: చిత్తూరు రైతుబజారులో అభివృద్ధి పనులు వేగవంతం చేసి రాష్ట్రంలోనే మోడల్‌ రైతుబజారుకు తీర్చిదిద్దనున్నామని ఈఈ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన రైతుబజారును పరిశీలించి.. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. రూ.5లక్షల నిధులతో సత్వరమే రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణం, తాగునీటి బోరు, గదుల మరమ్మతులు, రోజువారీ కూరగాయల ధరలు సూచించే డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, వినియోగదారులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. ఈఈ వెంట మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఇందుమతి, డీఈ హరినాథరెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులు, రైతుబజార్‌ ఉద్యాన పంటల సలహాదారు శశికళ, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts