Highlights
- మైదానంలో తన్నుకున్న ఆటగాళ్లు
- ఫైనల్‌లో లంక అభిమానుల మద్దతు
- భారత్ గెలవగానే వేడుకలు
శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపుతో శ్రీలంక అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత్ గెలుపును తమ గెలుపుగా భావించి వేడుక చేసుకున్నారు. ఈ సంబరాల వెనక బలమైన కారణాలు లేకపోలేదు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మితిమీరి ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోయిన శ్రీలంక అభిమానులు ఫైనల్ పోరులో భారత్‌కు మద్దతు ప్రకటించారు. భారత్ గెలిచిన వెంటనే లంక అభిమానులు దాదాపు పండుగ చేసుకున్నంత పనిచేశారు. ఓ శ్రీలంక అభిమాని.. భారత అభిమాని సుధీర్ కుమార్ చౌదరిని ఎత్తుకుని మైదానంలో పరుగులు తీశాడు. ఇదిలా ఉండగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వివాదాస్పదమైంది. వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా విధించింది. మైదానంలో ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు.బంగ్లాదేశ్ ఆటగాళ్లు మితిమీరి ప్రవర్తించారు. చివరికి అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. చివరి ఓవర్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. మరోవైపు, ఫైనల్‌కు చేరామన్న పట్టలేని ఆనందంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో ఉన్న ప్రెస్ రూమ్ అద్దాలు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు వేడుకుంది.