Highlights
- స్లిప్పు దొరికితే జరిమానా, జైలు
- కఠిన చర్యలపై అభ్యంతరాలు
- బెంబేలెత్తిపోతున్న టీచర్లు
- బాలికలను మగవారు తనిఖీ చేయగలరా?
తెలుగు రాష్ట్రలో జరుగుతున్న టెన్త్ పరీక్షలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన విధి నిర్వహణలో ఇన్విజిలేటర్ల సస్పెన్షన్ల ఆంక్షలో ఉపాధ్యాయవర్గాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల జారీ చేసిన ఆర్‌సీ నెంబరు 7 ఉత్తర్వుల ప్రకారం ఇన్విజిలేటర్లపై జరిమానా, జైలు శిక్షలతోపాటు సస్పెన్షన్ వంటి కఠిన చర్యలను 25/97 చట్టం ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం హిందీ సబ్జెక్టు పరీక్షలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరిని, నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.పరీక్ష రాస్తున్న వారు మాల్ ప్రాక్టీస్ /మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే ఆ విద్యార్థిని డిబార్ చేయడంతోపాటు, సంబంధిత ఇన్విజిలేటర్‌ను పరీక్ష విధుల నుంచి తప్పించడం ఇప్పటి వరకు జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్ల సస్పెన్షన్లకు కారణాలను ఆరా తీస్తే ఆశ్చర్యం కలుగకమానదు. స్లిప్పులతో ఓ బాలిక స్క్వాడ్‌కు పట్టుబడగా సంబంధిత ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసేశారు. వాస్తవానికి బాలికల వద్ద స్లిప్పులు లేకుండా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపడానికి మహిళా టీచర్లు ఉండాలి. కానీ ఈ ఏడాది జంబ్లింగ్ ప్రవేశపెట్టడంతో బాలికలు ఉన్న పరీక్షా కేంద్రానికి మగ ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వచ్చారు. బాలికలు కాబట్టి వారు తనిఖీ చేయలేదు. ఈ నేపఽథ్యంలో ఇన్విజిలేటర్ల సస్పెన్షన్ ఎంత వరకు సబబు అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.పశ్చిమగోదావరి జిల్లా ఎల్‌బీ చర్ల ఏపీ రెసిడెన్షియల్ స్కూలు పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు జవాబుపత్రాలను పరస్పరం మార్చుకుని రాస్తుండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుని ఇన్విజిలేటర్‌ను బాధ్యునిగా చేసి సస్పెండ్ చేసింది. ఇక్కడ ఇన్విజిలేటర్‌ను అకారణంగా బలి చేశారని ఆందోళన వ్యక్తమవుతోంది. దేవరపల్లి మండలం యర్నగూడెం పరీక్ష కేంద్రంలో విద్యార్థి వద్ద ఓ కాగితం ఉన్న కారణంగా డిబార్ చేయడంతోపాటు, అక్కడి ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఆ కాగితం పరీక్ష జరిగే సబ్జెక్టుకు సంబంధించినదేనా? ఒకవేళ అది స్లిప్పు అయితే జవాబుపత్రంతో పోల్చుకుని చర్యలు తీసుకుంటే బాగుండేదన్న వాదన వినిపించింది. ఇవేవీ లేకుండా డిబార్, సస్పెన్షన్లు చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనలతో ఇన్విజిలేటర్ విధులంటేనే ఉపాధ్యాయులు హడలి పోతున్నారు. నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.