త్వరలోజమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు!
శ్రీనగర్ నవంబర్ 14
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గిరీశ్ చందర్ ముర్ము గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందకు కేంద్రం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. దానికి ఇక్కడి యంత్రాంగం, పౌరులంతా సహకరించాలి. జమ్మూ కశ్మీర్ వ్యవహారాలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తోంది. కావును ఎన్నికల ప్రకటనను కేంద్రమే త్వరలో ప్రకటించనుంది’ అని అన్నారు. కాగా కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తారంటూ గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. తాజాగా మూర్ము చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకుంది.కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. కాగా 2018 జూన్ 20 నుంచి అక్కడ గవర్నర్ పాలన సాగుతోంది.