తాగేది గరళమే... (పశ్చిమగోదావరి)
ఏలూరు, నవంబర్ 14 : గ్రామీణ ప్రాంత ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో రక్షిత ప్రమాణాలు పాటించని తీరు ఆందోళన కలిగిస్తోంది. నెలలు దాటినా ట్యాంకులు శుభ్రం చేయని పరిస్థితి గోచరిస్తోంది. నిధుల కొరతతో మరమ్మతులకు గురైన ఫిల్టర్ బెడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అధికారులు ట్యాంకుల శుభ్రత గాలికొదిలేయడంతో ప్రజలకు కలుషిత నీరే గతవుతోంది. ఫలితంగా వ్యాధుల బారిన పడుతున్నారు. 80శాతం రోగాలు కలుషిత నీరు తాగడం వల్లే వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మంచినీటి ట్యాంకుల శుభ్రతపై యంత్రాంగం అలసత్వంతో ప్రజలకు కలుషిత నీరే శరణ్యమవుతోంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి కారణమైన తాగునీటి సరఫరాపై ఎవరూ దృష్టి సారించడం లేదు. రక్షిత నీటి పథకాలను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలనే నిబంధన ఆచరణకు ఆమడ దూరంలో నిలుస్తోంది. నీటి సామర్థ్యం, శుభ్రం చేసిన తేదీ, మళ్లీ శుభ్రం చేయాల్సిన తేదీ వంటి వివరాలు ట్యాంకు దగ్గర నమోదు చేయాలి. పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది దీన్ని పర్యవేక్షించాలి. ట్యాంకులను శుభ్రం చేయించాలి. వారంలో ఒకసారి క్లోరినేషన్ చేయాలి. ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసిన తేదీ, మరలా క్లోరినేషన్ చేయాల్సిన తేదీలను ట్యాంకుల వద్ద బోర్డులపై వేయాలి. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో ట్యాంకులను రెండు, మూడు నెలలకు కూడా శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాధులు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్నారని వాపోతున్నారు. పంచాయతీ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్న నీరు శుభ్రంగా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. కొన్నిచోట్ల పైపులైన్లు పగిలిపోగా, కొన్నిచోట్ల రంధ్రాలు పడి నీరు లీకవుతుంది. వీటిని అధికారులు సరిచేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) పథకాలకు చెందిన ఫిల్టర్ బెడ్లు జిల్లాలో పలుచోట్ల మరమ్మతుల బారినపడ్డాయి. ఫిల్టర్ బెడ్లు ఎక్కడెక్కడ పనిచేయడం లేదనేది గ్రామ పంచాయతీ నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు నివేదికలు వెళ్తున్నాయి. ఆయాచోట్ల పరిశీలన తరువాత మరమ్మతులు చేయాల్సిన పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క ఫిల్టర్ బెడ్ అభివృద్ధికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ నిధులు అవసరమని చెబుతున్నారు. 2018 ఆగస్టు ఒకటో తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఆనాటి నుంచి రక్షిత నీటి పథకాల నిర్వహణకు నిధుల లేమి సమస్య వెంటాడుతోంది. చిన్న గ్రామ పంచాయతీకి ఏడాదికి సాధారణ నిధులు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ ఏడాదికి జమవుతుంటాయి. అదే మేజర్ పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ జమవుతాయి. పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు ఈ నిధుల ఫలితాలు అందడం లేదు.