కేసీఆర్ కు జగన్ ప్రభుత్వం షాక్
విజయవాడ,, నవంబర్ 15
తెలంగాణకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశాన్ని పరిశీలించవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ సుప్రీంకోర్టులో పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. దీనికి కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడ్‌విట్‌లో ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని స్పష్టం చేసింది.పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను తప్పకుండా త్వరగా అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది. అలాగే, దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.విభజన చట్టంలో పేర్కొనని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కృష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ మాత్రం ఈ విషయంలో ముందుకెళ్తోందని తెలిపింది. దీనిపై మరోసారి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేసినా కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించింది. కృష్ణా బేసిన్‌లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, గోదావరి బేసిన్‌లో 450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టిందని పేర్కొంది.రీఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా ఇది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టేనని... దీని వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. అపెక్స్ కౌన్సిల్‌లో వీటిని చర్చించాలని పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, ఏపీ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని అఫిడవిట్‌లో ఏపీ కోరింది.గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌లోకి తరలించే 80 టీఎంసీలు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీకి 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు చెందుతాయని వివరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని, సముద్రంలోకి వృధాగా పొతున్న జలాలు వినియోగించుకోవడానికి పట్టిసీమ నిర్మించామని తెలిపింది. అయితే, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టా, శ్రీశైలం, రాయలసీమకు తరలిస్తున్న జలాల్లో 45 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరడం సమంజసంగా లేదని ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది