వరుస షాక్ లతో టీడీపీ
విజయవాడ, నవంబర్ 15
విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టిన రోజే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. దీక్ష రోజే ఇద్దరు ముఖ్య నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పడం సంచలనంగా మారింది. ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాగా మరొకరు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. ప్రజల్లో పట్టున్న ఇద్దరు యువ నేతలు పార్టీని వీడడం తెలుగుదేశానికి పెద్దదెబ్బగానే చెప్పాలి. వంశీ, అవినాష్ పార్టీ నుంచి నిష్క్రమించడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.తెలుగుదేశానికి గుడ్ బై చెప్పడం ఒక కారణమైతే.. రాజకీయంగా పొసగని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు ఒకే పార్టీలోకి వెళ్లడం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజా పరిణామాలతో ఇద్దరు యువనేతల నేపథ్యం తెరపైకి వస్తోంది. విజయవాడలో సీనియర్ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూకి.. యువ ఎమ్మెల్యే వంశీకి మధ్య కొంతకాలం వివాదం నడిచింది. అనుచరుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకూ వెళ్లింది.ఒకానొక దశలో ఇరువర్గాలు దాడులు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాయన్న వార్తలతో విజయవాడలో అలజడి రేగింది. రెండు వర్గాలు ప్రత్యక్ష దాడులకు దిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు.. తక్షణమే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా.. నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో కొగసాగుతున్నారు. విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ చతికిలపడడంతో ఆ తరువాత కాలంలో నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దేవినేని నెహ్రూ మరణించారు. అప్పటి నుంచి ఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ ఎమ్మెల్యే వంశీ, దేవినేని అవినాష్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవనేది రాజకీయ వర్గాల టాక్. చంద్రబాబు ఇద్దరికీ సమప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వంశీకి గన్నవరం.. అవినాష్‌కి గుడివాడ టిక్కెట్లు కేటాయించారు. వంశీ స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించగా.. అవినాష్ మంత్రి కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు అధికార వైఎస్సార్సీపీలో చేరిపోయారు. టీడీపీకి ఈ రోజు ఉదయం రాజీనామా చేసిన దేవినేని అవినాష్.. సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన వంశీ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి తాను జగన్‌తో కలిసి నడవాలనుకుంటున్న కుండబద్దలు కొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా? జగన్ డైరెక్షన్‌లో సర్దుకుపోతారా? లేక ఆధిపత్యం కోసం పావులు కదుపుతారా? అన్న చర్చ నడుస్తోంది.