నిన్న మహారాష్ట్ర... ఇవాళ జార్ఖాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 15
మహారాష్ట్ర రాజకీయం ఇతర రాష్ట్రాలకూ పాకుతోంది. మహారాష్ట్రలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఫలితాల తర్వాత అది పెటాకులయింది. శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్ కు తగినన్ని సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. పదవుల పంపకంలో వచ్చిన తేడాయే ఎందుకు కారణం. ఎన్నికల్లో కలసి పోటీ చేసినప్పటికీ తర్వాత మిత్రులిద్దరూ విడిపోయారు. దీంతో మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో పాటు దాని మిత్ర పక్షాలూ జాగ్రత్త పడుతున్నాయి.తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో గత ఎన్నికల్లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, లోక్ జనశక్తి పార్టీలు కలసి కూటమిగా పోటీ చేశాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ 72 స్థానాల్లో పోటీ చేయగా, ఏ.జే.ఎస్.యుకు ఎనిమిది, లోక్ జనశక్తికి ఒక స్థానం కేటాయించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 37 చోట్ల, ఏజేయూఎస్ యూ ఐదు చోట్ల గెలుపొందడంతో అధికారంలోకి రాగలిగింది. ఒక్క స్థానంలోనూ పోటీ చేసి లోక్ జనశక్తి ఓటమి పాలయింది.అయితే తాజాగా జరుగుతున్న జార్ఖండ్ ఎన్నికల్లో మిత్రులు ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో 8 సీట్లు తీసుకున్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఈసారి 19 స్థానాలను డిమాండ్ చేస్తోంది. అయితే 9 కంటే ఎక్కువ స్థానాలను ఇవ్వలేమని బీజేపీ తెగేసి చెప్పింది. కానీ ఇప్పటికే ఏజేయూఎస్ యూ పన్నెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. బీజేపీ రాష్ట్ర నేతలు ఎంత సర్దిచెబుతున్నప్పటికీ ఆ పార్టీ నేతలు విన్పించుకోవడం లేదు.అలాగే మరోమిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ గత ఎన్నికల్లో ఒక్క స్థానంలోనే పోటీ చేసింది. అయితే ఈసారి ఆరు స్థానాలను డిమాండ్ చేసింది. దీనికి బీజేపీ నాయకత్వం అంగీకరించడంతో ఒంటరిగా బరిలోకి దిగుతామని లోక్ జనశక్తి పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. తమకు పట్టున్న యాభై నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్, జేఎంఎంలు కలసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ మిత్రుల మధ్య సయోధ్య కుదిరితే సరే… లేకుంటే మాత్రం అది కాంగ్రెస్ కూటమికి లాభం జరిగే అవకాశం ఉంది