మళ్లీ యాక్టివ్ అవుతున్న అఖిల
కర్నూలు,
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అఖిలప్రియ గత కొద్దిరోజులుగా యాక్టివ్ గా కనపడుతున్నారు. ఓటమి తర్వాత ఆళ్లగడ్డకు, కార్యకర్తలకు కొంతకాలం దూరంగా ఉన్న అఖిలప్రియ మళ్లీ రైజ్ అవుతున్నారు. తన తల్లిని ఆదరించిన ఆళ్లగడ్డను వదిలేసే ప్రసక్తి లేదని అఖిలప్రియ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గత ఎన్నికల్లో తాను ఓటమి చెందానని, అయినా తాను తిరిగి ప్రజల్లోనే ఉంటానని అఖిలప్రియ చెబుతున్నారు.నిజానికి ఎన్నికలకు ముందునుంచే అఖిలప్రియ వెన్నంటి ఉన్న వారు ఒక్కొక్కరూ వెళ్లిపోయారు. వారు పార్టీని వీడి వెళ్లిపోతూ అఖిలప్రియ వైపు చూపించి వెళ్లారు. అఖిలప్రియ వ్యవహార శైలి వల్లనే తాము పార్టీ మారామని చెప్పారు. దీంతో అఖిలప్రియ వ్యక్తిగతంగా డ్యామేజీ అయ్యారు. దీంతో పాటు భూమా కుటుంబంలోనే విభేదాలు తలెత్తాయి. భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. భూమా నాగిరెడ్డి వారసులెవ్వరన్న దానిపైనే వివాదం కుటుంబంలో రేగింది.అయితే అఖిలప్రియ మాత్రం తానే భూమా వారసురాలినంటున్నారు. తన సోదరుడు విఖ్యాత్ రెడ్డికి అవకాశం ఇస్తామని, అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గం మాత్రం వదిలేది లేదని చెబుతున్నారు. తన తల్లి భూమా శోభానాగిరెడ్డి తనకు ఇచ్చిన గిఫ్ట్ గా అఖిలప్రియ వ్యాఖ్యానిస్తున్నారు. విఖ్యాత్ రెడ్డి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేంత వరకూ తానే ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో కూడా భూమా వారసులుంటారని ఆమె చెబుతున్నారు.ఐదు నెలల నుంచి నియోజకవర్గంలో అడపా దడపా వస్తున్న అఖిలప్రియ ఇకమీదట ఆళ్లగడ్డకే పరిమితమవుతున్నాని కార్కకర్తలకు చెప్పారట. ఏ కష్టం వచ్చినా తనను కలవాలని చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లే వారిని ఎవరినీ తాను ఆపనని, కొత్త వారికి మంచి పదవులు వస్తాయని ద్వితీయ శ్రేణి నేతలను ఊరిస్తున్నారు. ఓటమి తర్వాత ఎవరు తనకు అండగా ఉన్నవారో తెలిసి వచ్చిందని, వారందరికీ మంచి భవిష‌్యత్తు ఉంటుందని అఖిలప్రియ భరోసా ఇస్తున్నారట. మొత్తం మీద అఖిలప్రియ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ ఆళ్లగడ్డలోని టీడీపీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు