పీసీసీ రేసులో జగ్గారెడ్డి...
హైద్రాబాద్, నవంబర్ 15
తెలంగాణ పీసీసీ పదవిపై పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ బరిలో తానూ ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన బయోడేటా కూడా పంపించినట్లు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైదొలిగిన రోజు ఆ పదవిని తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలో తన బయోడేటాను పార్టీ పెద్దలకు పంపానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురికి బయోడేటా పంపించినట్లు ఆయన వివరించారు.‘టీపీసీసీ పదవి అంశంపై త్వరలోనే పార్టీ పెద్దలను కలుస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా వద్ద అద్భుతమైన ఔషదం ఉంది. అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసుకొస్తా’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు.
పీసీసీ పదవి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే వర్గ పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హుజూర్‌నగర్ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్‌ను మార్చే అంశానికి పార్టీలో బలం పెరిగింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు కీలక నేతలు ఈ పదవిపై కన్నేశారు. అతి త్వరలోనే టీపీసీసీ చీఫ్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది