చర్చానీయంశంగా మారిన చెన్నమనేని కామెంట్స్
హైద్రాబాద్,
తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ పుంజుకుంటున్న సమయంలో మాజీ గవర్నర్ విద్యాసాగరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. విద్యాసాగరరావు వ్యాఖ్యలను కొందరు బీజేపీ నేతలు పాజిటివ్ గా తీసుకుంటుంటే మరికొందరు ఖండిస్తున్నారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఎందుకోసం? రాజకీయ కారణాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు.ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోయింది. ప్రమాదకర స్థాయిని దాటిందని వాతావరణ శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రెండో రాజధాని ప్రతిపాదన ఈనాటిది కాదు. అంబేద్కర్ కూడా ఇదే సూచన చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంశం పాతదే కావచ్చు. గతంలోనే ఇది అనేకసార్లు విన్పించింది. అయితే తాజాగా మాజీ గవర్నర్ విద్యాసాగరరావు కామెంట్స్ తో మరోసారి రెండో రాజధాని అంశం తెరమీదకు వచ్చింది.గవర్నర్ గా పనిచేసిన విద్యాసాగరరావు ఆషామాషీ నాయకుడు కాదు. ఆయనకు అపార రాజకీయ అనుభవం ఉంది. కేంద్రంలో ఉన్న పెద్దలతో సత్సంబంధాలున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వంతో నిత్యం టచ్ లో ఉన్నారు. విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చూసుకోమని కేంద్ర నాయకత్వం చెప్పిందంటే ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. కేంద్రం నుంచి లీకు కాకుండా చిల్లరగా విద్యాసాగరరావు ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయరన్నది అందరికీ తెలిసిందే.విద్యాసాగరరావు వ్యాఖ్యలను, ఇతర అంశాలను ముడిపెట్టి చూస్తున్నారు కొందరు. అందుకే కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారని కూడా అన్వయించుకుంటున్నారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేసి ఇటు టీఆర్ఎస్, అటు ఎంఐఎం రెక్కలు కట్ చేసేందుకేనన్న కామెంట్స్ కమలనాధుల నుంచి విన్పిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కేంద్రం పెద్దలతో సంబంధాలున్న విద్యాసాగరరావు మాటలను కొట్టి పారేయలేం. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ సాధించేదేమిటి? ఇది ఒక రకంగా కేసీఆర్ కు మేలు చేస్తుందనే వారు కూడా లేకపోలేదు